Reforms In Telangana Intermediate Education: తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ప్రభుత్వ విద్య బలోపేతానికి అనేక చర్యలుచేపడుతోంది. ఇప్పటికే పాఠశాల విద్యలో అనేక మార్పులు చేసింది. హాజరు శాతం పెంచేలా ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ప్రవేశపెట్టింది. ఉపాధ్యాయుల డుమ్మాకు చెక్ పెట్టింది. ఇంటర్మీడియెట్‌లోనూ సంస్కరణలు మొదలు పెట్టింది. ఇప్పటికే పెరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించింది. తాజాగా ప్రాక్టికల్ పరీక్షలు ఫస్ట్ ఇయర్ నుంచే అమలు చేయాలని నిర్ణయించింది. ఎంపీసీ గ్రూప్‌లో భౌతిక, రసాయనశాస్త్రాల ప్రాక్టికల్స్‌కు 15+15 మార్కులు ఉంటాయి. బైపీసీ గ్రూప్‌లో నాలుగు సబ్జెక్టులకు 120 మార్కులు.. వాటిని కూడా సగం, సగం పద్ధతిలో కేటాయిస్తారు. ఈ మార్పుతో విద్యార్థులు ల్యాబ్‌లలో తరగతులు ప్రారంభ దశ నుంచే అనుభవమేర్చుకోగలరని అధికారులు భావిస్తున్నారు.
కొత్తగా ఏసీఈ గ్రూప్..
మార్కెట్ ధోరణులకు అనుగుణంగా కొత్త ఏసీఈ (అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) గ్రూప్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటి వరకు ఉన్న సీఈసీ గ్రూప్‌లో సివిక్స్ స్థానంలో ఎకౌంటెన్సీని తీసుకురావడం ద్వారా విద్యార్థులకు వాణిజ్య రంగంలో మరిన్ని అవకాశాలు లభిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
ఎన్సీఈఆర్టీ ప్రమాణాలకు అనుగుణంగా..
ప్రస్తుతం తెలంగాణ ఇంటర్ సిలబస్ జాతీయ ప్రమాణాల కంటే విస్తారంగా ఉండటంతో, దానిని ఎన్సీఈఆర్టీ ప్రమాణాలకు సమానంగా కుదించాలని నిర్ణయించారు. ముఖ్యంగా గణితం, భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం సబ్జెక్టుల్లో కొంతభాగం తొలగించనున్నారు. తద్వారా విద్యార్థులపై పరీక్షల భారం తగ్గుతుందని భావిస్తున్నారు.
డిజిటల్ పాఠ్యపుస్తకాలు..
టెక్నాలజీ సమన్వయాన్ని పెంచేందుకు ప్రతి పుస్తకంలో క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు. విద్యార్థులు దాన్ని స్కాన్ చేసి సంబంధిత విషయాలపై అదనపు వీడియోలు, వివరణలు తెలుసుకోవచ్చును. ఇది విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండువర్గాలకు కూడా సమయోచిత మార్గదర్శకంగా ఉపయోగపడనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ సంస్కరణలు పరీక్షా వ్యవస్థలో సార్వత్రిక మార్పుకు నాంది. ‘‘ఒక్కసారి పరీక్ష, జీవితాంతం ఫలితం’’ అనే పాత ధోరణి నుంచి బయటపడుతూ, నిరంతర అంచనా – ప్రాక్టికల్ పరిజ్ఞానం – టెక్నాలజీ ఆధారిత అధ్యయనంపై ఇంటర్ విద పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నట్లు విద్యావేత్తలు భావిస్తున్నారు.