India vs New Zealand ICC Women’s World Cup 2025: అంచనాలు పెట్టుకున్న అమ్మాయిలు అదరగొట్టారు. అబ్బాయిలు మాత్రం చేతులెత్తేశారు. కచ్చితంగా గెలవాల్సిన చోట మన అమ్మాయిలు సత్తా చూపించారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అన్నింటికంటే ముఖ్యంగా మహిళల వరల్డ్ కప్ లో సరికొత్తస్థాయిలో రికార్డులు సృష్టించారు. బీభత్సంగా పరుగులు చేసి.. అనితర సాధ్యమైన విజయాన్ని అందుకున్నారు. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో గెలిచి చూపించి.. ఏకంగా సెమీఫైనల్ దాకా వెళ్ళిపోయారు.. కానీ అబ్బాయిలు మాత్రం ఓడిపోయి పరువు తీసుకున్నారు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో టీమిండియా ఓటమిపాలైంది. ఆతిథ్య జట్టును కచ్చితంగా ఓడించాల్సిన మ్యాచ్లో.. గెలవలేకపోయింది. బ్యాటింగ్లో సత్తా చూపించలేకపోయింది. బౌలింగ్లో అదరగొట్ట లేకపోయింది. ఇక ఫీల్డింగ్ విషయంలో కూడా నాసిరకమైన ప్రదర్శన చేసింది. రోహిత్ నుంచి మొదలుపెడితే గిల్ వరకు ఉన్నప్పటికీ.. భారత్ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయింది. గిల్, విరాట్, నితీష్ కుమార్ రెడ్డి, కేఎల్ రాహుల్ వంటి వారు దారుణమైన ప్రదర్శన చేయడంతో టీమిండియా భారీ స్కోర్ చేయలేకపోయింది. ఒకానొక దశలో భారీ స్కోర్ చేసే అవకాశం ఉన్నప్పటికీ టీమిండియా చేతులారా దానిని పోగొట్టుకుంది. వచ్చిన అవకాశాన్ని ఆస్ట్రేలియా సద్వినియోగం చేసుకొని విజేతగా నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క వన్డే మ్యాచ్ కూడా టీమిండియా ఓడిపోలేదు. సిరీస్ కూడా దూరం చేసుకోలేదు. టీమిండియా కు మేనేజ్మెంట్ సారధిని మార్చడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అంతేకాదు ఊహించని ఓటమి ఎదురై.. సిరీస్ కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఇక మహిళల జట్టు మన దేశం వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో ఇటీవల మూడు మ్యాచ్లు ఓడిపోయింది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల చేతిలో హ్యాట్రిక్ ఓటములు అందుకుంది. వాస్తవానికి ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా మీద టీం ఇండియా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కీలక దశలో ఒత్తిడికి గురి కావడంతో టీమ్ ఇండియా ఓటమి పాలు కాక తప్పలేదు. బ్యాటింగ్ లో అదరగొడుతున్నప్పటికీ.. బౌలింగ్లో మాత్రం టీమిండియా దారుణమైన ప్రదర్శన చేస్తోంది. అందువల్లే ఊహించని ఓటములు ఎదురవుతున్నాయి. టీమిండియా ఇలా ఓడిపోవడం పట్ల అభిమానులు సోషల్ మీడియా వేదికగా నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. అయితే సెమిస్ వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన సందర్భంలో.. టీమిండియా న్యూజిలాండ్ పై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఓపెనర్లు ఇద్దరు సెంచరీలు చేయడంతో టీమిండియా 300+ స్కోర్ చేసింది. మధ్యలో వర్షం కురవడంతో ఓవర్లను కుదించారు. న్యూజిలాండ్ లక్ష్యాన్ని కూడా తగ్గించారు. అయితే ఈ దశలో భారత బౌలర్లు అదరగొట్టడంతో టీమ్ ఇండియాకు విజయం సాధ్యమైంది.. తద్వారా టీమిండియా సెమీఫైనల్ వెళ్ళిపోయింది. లీగ్ దశలో టీమిండియా బంగ్లాదేశ్ జట్టుతో తన చివరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో గెలిచినా, ఓడిపోయినా భారత మహిళల జట్టుకు ఏమీ కాదు. అలాగని ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగ్లాదేశ్ పై భారత్ ఓడిపోయే దాఖలాలు కనిపించడం లేదు.