Manugunta Mahidhar Reddy: ఇటీవల ఏపీ( Andhra Pradesh) రాజకీయాల్లో ఒక ఘటన ప్రకంపనలు రేపింది. నెల్లూరు జిల్లా కందుకూరులో ఓ హత్య కులాల మధ్య కుంపట్లు రాజేసేందుకు కారణమయ్యింది. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. ప్రభుత్వం సకాలంలో స్పందించడంతో అది చల్లబడింది. ఆపై మృతుడి కుటుంబ సభ్యులు సహకరించకపోవడంతో రాజకీయ పార్టీలతో పాటు కుల సంఘాలు సైలెంట్ కావాల్సి వచ్చింది. టిడిపి కూటమికి అండగా నిలుస్తూ వచ్చాయి కమ్మ, కాపు సామాజిక వర్గాలు. అయితే కందుకూరు ఘటన ద్వారా ఆ రెండు సామాజిక వర్గాల మధ్య విభేదాలు రావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. కానీ అనుకున్న స్థాయిలో అక్కడ మైలేజ్ రాలేదు. దానికి కారణం కందుకూరులో బలమైన నేత పార్టీకి దూరంగా ఉండటమే. పై జిల్లాలనుంచి వచ్చిన నేతలు, వైసిపి అనుకూల కాపు సంఘాల ప్రతినిధులు దానిని రాజకీయం చేసేందుకు ప్రయత్నించాయి. కానీ వర్క్ అవుట్ కాలేదు. దానికి కారణం వైసీపీ నేత మానుగుంట మహీధర్ రెడ్డి.
* సుదీర్ఘ చరిత్ర..
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో( Prakasam district) మానుగుంట కుటుంబానికి మంచి చరిత్ర ఉంది. మొన్న జిల్లాల పునర్విభజనలో కందుకూరు నెల్లూరు జిల్లాలో వచ్చి చేరింది. అంతకుముందు కందుకూరు నియోజకవర్గం నుంచి ఆరుసార్లు గెలిచారు మానుగుంట కుటుంబ సభ్యులు. తొలుతా మహీధర్ రెడ్డి తండ్రి మూడుసార్లు ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అటు తరువాత మహీధర్ రెడ్డి మరో మూడు సార్లు గెలిచారు. కాంగ్రెస్ హయాంలో మంత్రి పదవి కూడా చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి తనకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తారని భావించారు. కానీ అలా ఇవ్వలేదు సరి కదా.. 2024 ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వలేదు. అప్పటినుంచి ఫుల్ సైలెంట్ లో ఉన్నారు మహీధర్ రెడ్డి.
* ఇటీవల జరిగిన పరిణామాలతో..
ఇటీవల కందుకూరు( kandukur ) నియోజకవర్గంలో లక్ష్మయ్య నాయుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. హరిచంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కారుతో తొక్కి పెట్టి చంపేశారు. చనిపోయింది కాపు సామాజిక వర్గం నేతకాగా.. చంపింది కమ్మ సామాజిక వర్గం నాయకుడు. దీనిని రాజకీయంగా మలుచుకోవాలని వైసిపి భావించింది. కానీ స్థానికంగా డీల్ చేసే సమర్థ నేత లేరు. ఇంతలో ప్రభుత్వం స్పందించింది. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. అదే సమయంలో బాధిత కుటుంబ సభ్యులు ఇది రాజకీయ, కుల హత్య కాదని.. కేవలం ఆర్థికపరమైన విభేదాలతో జరిగిన హత్యగా తేల్చారు. దీంతో వైసిపి ప్రయత్నాలు ఏవి విజయవంతం కాలేదు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పిలిచారని.. యాక్టివ్ కావాలని కోరినట్లు ప్రచారం నడిచింది. అయితే మహిధర్ రెడ్డి రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పాలని.. ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండకుండా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కేవలం జగన్మోహన్ రెడ్డి నుంచి ఎదురైన ఈ పరాభవంతోనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే కందుకూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది ఆ పార్టీ హై కమాండ్ మరిచిపోవాల్సిందే.