Raithu Runamafi : రుణమాఫీ సంపూర్ణం.. ఏకమొత్తంలో రైతులకు రూ.2 లక్షల వరకు రుణ విముక్తి !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీ హామీలు ఇచ్చింది. మేనిఫెస్టోలో మరో 420 అంశాలు పేర్కొంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో హామీల అమలుపై దృష్టిపెట్టింది. ఇందులో కీలకమైన రైతు రుణమాఫీ రెండు విడతల్లో రూ.1.50 లక్షల వరకు మాఫీ చేసింది.

Written By: Raj Shekar, Updated On : August 15, 2024 3:00 pm

Raithu Runamafi

Follow us on

Raithu Runamafi : తెలంగాణలో మూడో విడత రైతు రుణమాఫీకి ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే రెండు విడతల్లో రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం మూడో విడత మాఫీని ఆగస్టు 15న పూర్తి చేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో 11 లక్షల మంది లబ్ధి పొందగా, రెండో విడతలో 6.5 లక్షల మందికి రుణమాఫీ అయింది. మూడో విడతలో మరో 14 లక్షల మంది రుణాలు మాఫీ కానున్నాయి. ఖమ్మం జిల్లా వైరాలో మూడో విడత రైతు రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విడుదల చేస్తారు. హైదరాబాద్‌లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత సీఎం వెళ్లారు. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు మోటార్లు ఆన్‌ చేశారు. తర్వాత జరిగే బహిరంగ సభలో రుణమాఫీ నిధులు విడుదల చేశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.2 లక్షల్లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌లో ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే రూ.లక్ష రుణాన్ని మాఫీ చేశారు. మొదటి విడతలో 11,34,412 మందికి రూ.6034 కోట్లను ఇప్పటికే చెల్లించారు. రెండో విడతలో 6,40,223మందికి రూ. 6190 కోట్లను విడుదల చేశారు. మొదటి రెండు విడతల్లో రుణమాఫీ లబ్ది పొందిన వారిలో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో, చివరి స్థానంలో హైదరాబాద్‌ ఉంది.

వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌..
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ 2023 మే 6న వరంగల్‌లోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో రైతు డిక్లరేషన్‌ ప్రకటించారు. ఇందులో రైతులకు సంబందించిన రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. ఈమేరకే కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణమాఫీకి జూలై 18న శ్రీకారం చుట్టింది. మొదటి విడత 11 లక్షల మందికి, రెండో విడతలో 6.5 లక్షల మంది పంట రుణాలు మాఫీ చేశారు. ఆగస్టు 15 నాటికి రుణ మాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచార సభల్లో తెలిపారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.1.50 లక్షల వరకు రుణాలు మాఫీ చేశారు. ఆగస్టు 15తో రూ.2 లక్షలోపు రుణాల మాఫీని పూర్తి చేయనున్నారు.

మూడో విడతకు నిధుల కేటాయింపు..
రైతు రుణమాఫీ సాధ్యం కాదని విపక్షాల విమర్శల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జులై 18న మొదటి విడతలో 11,14,412 మంది రైతులకు రూ.6034.97 కోట్లు విడుదల చేశారు. జులై 30న అసెంబ్లీ ప్రాంగణంలోనే రెండో విడతలో రూ. లక్షన్నర వరకు రుణమున్న రైతు కుటుంబాలకు మాఫీ చేశారు. దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో రూ.6,190.01 కోట్లు జమ చేశారు. రెండు వారాల్లో దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు రూ.12 వేల కోట్లను చెల్లించారు. మూడో విడతలో రూ.2 లక్షల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తారు. మూడో విడతలో 14.45 లక్షల మంది రైతులకు లబ్ది కలుగుతుంది. ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్‌ కేటాయింపులు జరిపారు.