Lawyer Vamana Rao couple Case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేయడంతో ఆ రోజు ఏం జరిగింది అనే విషయమై మళ్ళీ చర్చ ఊపందుకుంది. 2021 ఫిబ్రవరి 19న, ఒకవైపు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వేళ..ఉదయం మంథని కోర్టులో ఒక కేసు గురించి వచ్చి హైదరాబాద్ కు తన కారులో తిరిగి వెళ్తున్న క్రమంలో ఇరువురు దంపతులను దుండగులు రామగిరి పోలీసుస్టేషన్ పరిధిలోని నడిరోడ్డుపై దారికాచి అందరూ చూస్తుండగానే మారణాయుధాలతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఈ దాడిలో నాగమణి అక్కడికక్కడే మృతిచెందగా, వామన్ రావు తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కొట్టుకుంటుండగా గమనించిన కొంతమంది అతన్ని ఒక వాహనంలో పెద్దపల్లి ఆసుపత్రికి తరించగా అక్కడే ఆయన తుది శ్వాస వదిలారు. మంథని పెద్దపల్లి రహదారి మధ్య పట్టపగలు రద్దీగా ఉన్న సమయంలోనే జరిగిన ఈ హత్యాకాండ ను కొంతమంది ప్రయాణికులు మొబైల్ లో చిత్రీకరించారు. అలాగే దాడిలో తీవ్రంగా గాయపడి రోడ్డుపై సహాయం కోసం అర్థిస్తున్న వామనరావు కొనఊపిరితో ఉండగా తనపై దాడి చేసిన వారి వివరాలను వెల్లడించిన ఒక వీడియో కూడా అప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.
Also Read: అమరావతికి నందమూరి బాలకృష్ణ.. రేపే ముహూర్తం!
ఈ కేసుకు సంబంధించి నిందితులను అరెస్టు చేసి విచారణ జరిపారు. అప్పటి ఐజీ నాగిరెడ్డి కేసు దర్యాప్తు జరిపి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ సంఘటనపైరెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. వివిధ పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే, అప్పటి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను తో పాటు కుంట శ్రీను, చిరంజీవి ప్రధాన నిందితులుగా నిర్ధారించగా, వారికి సహకరించిన వారిని కోర్టుకు హాజరుపర్చారు.
అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రమేయముందని, కేసును సీబీఐకి అప్పగించి సమగ్ర దర్యాప్తు జరుపాలని వామన్ రావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసు ఎన్నోసార్లు విచారణకు వచ్చింది కానీ ఫైనల్ గా మంగళవారం మాత్రం ఈ కేసుకు సంబంధించి కీలక ఆదేశాలు సుప్రీంకోర్టు జారీ చేసింది. 2021 ఫిబ్రవరి 19న జరిగిన ఈ హత్యలో అప్పటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ప్రమేయం ఉండడంతో విచారణ సరిగ్గా జరగలేదంటూ గట్టు కిషన్ రావు తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులు మేనక గురుస్వామి, చంద్రకాంత్ రెడ్డి తమ వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసులో ఉన్నట్లు ఆరోపించబడుతున్న పుట్ట మధుతో పాటు మరికొంతమంది తరపున వాదిస్తున్న న్యాయవాదులు ఇప్పటివరకు ఈ కేసు విచారణ సరిగ్గానే జరిగిందనీ, కేసు హైకోర్టు పర్యవేక్షణ ఉందని వాదించారు. అలాగే హత్య ఘటన జరుతున్న సమయంలో తీసిన వీడియోలు అన్ని కూడా హైదరాబాదులో ఎఫ్ఎస్ఎల్ సంబంధించి పూర్తి నివేదిక తయారు చేసిందనీ, ఇప్పుడు మళ్లీ కొత్తగా మరొక దర్యాప్తు సంస్థకు ఈ కేసును బదిలీ చేయాల్సిన అవసరం లేదని తమ వాదనలు వినిపించారు. కానీ గట్టు కిషన్ రావు మాత్రం తన కొడుకు, కోడలు హత్యకు సంబంధించిన విచారణ రాష్ట్రంలో సరిగా జరగట్లేదు అంటూ ఆయన తరుపున వినిపించిన వాదనలు సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. సిబిఐకి ఈ కేసును బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్లకు ప్రొటెక్షన్ కావాలని కూడా ప్రతివాదులకు చెందిన అడ్వకేట్స్ అడిగినా, ప్రొటెక్షన్ ఇచ్చేది లేదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సంచలనం సృష్టించిన గట్టు వామనరావు దంపతుల కేసును సిబిఐ కి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఏ విధంగా దర్యాప్తు జరుపుతుంది. పరిస్తితి ఎలా ఉంటుందనే విషయమై చర్చోపచర్చలు ఊపందుకున్నాయి.