Road Accident In America: ఆయన పేరు శ్రీనివాసరావు. మేడ్చల్ జిల్లాలో గండి మైసమ్మ ప్రాంతంలో నివాసం ఉంటారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. శ్రీనివాసరావు ఉన్నత చదువులు చదవాలి అనుకున్నారు. కానీ ఆయనకు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో కొంతవరకు మాత్రమే చదువుకున్నారు. అయితే తన పిల్లలకు ఆర్థిక సమస్యలు ఇబ్బంది కాకూడదని ఆయన రెక్కలు ముక్కలు చేసుకొని.. జీవితంలో స్థిరపడ్డారు. తనకు రెండు కళ్ళ లాంటి పిల్లలను ఉన్నతంగా చదివించడం మొదలుపెట్టాడు. అయితే శ్రీనివాసరావు పెద్ద కుమార్తె శ్రీజ మరింత ఉన్నత చదువులు చదవాలని కోరితే.. దానికి ఆయన ఒప్పుకున్నారు.
Also Read: అమరావతికి నందమూరి బాలకృష్ణ.. రేపే ముహూర్తం!
ఉన్నత చదువులు చదివించే క్రమంలో భాగంగా శ్రీజను ఆయన అమెరికా పంపించారు. శ్రీజ ప్రస్తుతం చికాగోలో ఉంటోంది. అక్కడ ఉన్నత చదువులు చదువుకుంటున్నది. మరికొద్ది రోజుల్లో ఆమె తన చదువులు పూర్తి చేసి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడుతుంది అనుకుంటున్న తరుణంలో ఊహించని దారుణం చోటుచేసుకుంది. ఆ సంఘటన శ్రీనివాసరావు కుటుంబంలో తీరని విషాదం నింపింది. శ్రీజ చికాగో ప్రాంతంలో డిన్నర్ కోసం తన స్నేహితులతో కలిసి వెళ్ళింది. ఈ క్రమంలోనే రోడ్డు దాటుతున్న ఆమెను ఒక ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీజ దుర్మరణం పాలైంది. ట్రక్కు ఢీ కొట్టిన నేపథ్యంలో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయాలైన ఆమెను స్నేహితులు స్థానికంగా ఉన్న ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ శ్రీజ బతకలేదు.
శ్రీజ దుర్మరణం చెందిన నేపథ్యంలో అమెరికా వైద్యులు వీడియో కాల్ ద్వారా ఈ సమాచారాన్ని శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తెలియజేశారు..” తలకు తీవ్రంగా గాయమైంది. రక్తస్రావం కూడా అధికంగా జరిగింది. ఆమెను బతికించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసాం. మా ప్రయత్నాలు వృధా అయిపోయాయి. ఆమె బతకలేదు. ఈ విషయాన్ని మీకు చెప్పడానికి బాధగా ఉంది. ఈ కష్టకాలంలో భగవంతుడు మీకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం. మీ కుమార్తె మరణం మాకు అత్యంత బాధాకరమని” వీడియో కాల్ లో వైద్యులు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. శ్రీజ మరణంతో శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు గుండెలు పగిలే విధంగా రోదిస్తున్నారు. ఉన్నత చదువులు చదవడానికి వెళ్ళిన తన కుమార్తె ఇలా రోడ్డు ప్రమాదంలో బలి కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీజ మరణం నేపథ్యంలో గండి మైసమ్మ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శ్రీజ మృతదేహాన్ని ఇండియాకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.