KTR Trolls Revanth Reddy: తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు మారిపోతున్నాయి. ముఖ్యంగా నేతలు చేసుకునే విమర్శలు సినిమాల చుట్టూ తిరుగుతున్నాయి.. ఒకప్పుడు విధానాల పరంగా.. వ్యవస్థలో లోపాల ఆధారంగా నాయకులు విమర్శలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు విధానాలను పక్కన పెట్టారు. వ్యవస్థల లోపాలను పట్టించుకోవడం మానేశారు. కేవలం వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. అయితే ఆ విమర్శలు కూడా ఒక స్థాయిని దాటి పోతున్నాయి. వ్యక్తిగత విషయాలు విమర్శలలో ప్రధానంగా వినిపిస్తున్నాయి.
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి హస్తిన వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిశారు. కీలక విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ సమావేశంలో రేవంత్ తను పరిపాలిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన మార్పులు, అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. ఇదే క్రమంలో తనకు సోనియా గాంధీ నుంచి లేఖ వచ్చిందని.. అది ఆస్కార్ కంటే గొప్పదని.. ఇంతకంటే విలువైన గౌరవం ఇంకొకటి ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ ఆ పార్టీకి కీలక నాయకురాలు.. పెద్ద దిక్కు కూడా.. అలాంటి ఆమె దగ్గర్నుంచి ప్రశంస లభించింది అంటే ఒక రకంగా రేవంత్ ప్రభుత్వ పనితీరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఆకట్టుకుందని అర్థం. పైగా రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి.. తన పార్టీలో కీలక నాయకురాలు తనని అభినందిస్తూ చెప్పిన విషయాన్ని గొప్పగా ప్రస్తావించారు. ఇందులో తప్పు పట్టడానికి లేదు. తప్పు అని చెప్పడానికి లేదు.
Also Read: ఆ తెలంగాణ పత్రిక సర్వర్ హ్యాక్.. దీని వెనక ఎవరి హస్తం ఉందో?
కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఈ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసింది. ఇటీవల కాలంలో రేవంత్ నుంచి చిన్న విషయం బయటికి వచ్చిన సరే భారత రాష్ట్ర సమితి దానిని ఏదో చేయాలి అనుకుంటున్నది. విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో ఆనందం పొందుతున్నది. ఇక దాని పెయిడ్ బ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రేవంత్ సోనియా గాంధీ తనకు రాసిన లేఖను ప్రస్తావిస్తూ చేసిన ప్రసంగం లో చిన్న వీడియోను కట్ చేసి.. ఓ సినిమాలో హాస్య సన్నివేశాన్ని దానికి జోడించి.. తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించే ప్రయత్నం చేశారు. పైగా రేవంత్ మాటలను ఉటంకిస్తూ కేటీఆర్ ఆస్కార్, భాస్కర్ అవార్డులు అంటూ విమర్శించారు. ఈ వీడియోను భారత్ రాష్ట్ర సమితి నాయకులు సోషల్ మీడియాలో తెగ తిప్పుతున్నారు..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. మరి దీనికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎటువంటి వీడియో రూపొందిస్తారో చూడాల్సి ఉంది.