KTR: తెలంగాణలో కంచె గచ్చిబౌలి(Kanche Gachibouli)భూముల వ్యవహారం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. ఈ భూముల్లో అడవులను తొలగించడంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతన్నాయి. కోర్టులు కూడా స్పందించాయి. సెలబ్రిటీలు కూడా అడవులు తొలగించొద్దని కోరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా కేసీఆర్ ఓ హెచ్చరిక జారీ చేశారు.
Also Read: రేవంత్‌పై వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరిక!
తెలంగాణలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) భూముల వివాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS working Prasident), మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం (ఏప్రిల్ 3, 2025) తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, రేవంత్ ప్రభుత్వం హెచ్‌సీయూ భూముల విషయంలో అనాలోచితంగా వ్యవహరిస్తోందని, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వానిది రియల్ ఎస్టేట్(Real Estate) ఆలోచన మాత్రమే‘ అని ఆయన విమర్శించారు.
కొంటే ఇబ్బందులే..
కేటీఆర్ మాట్లాడుతూ, ‘తెలంగాణ హైకోర్టు చీవాట్లు పెడుతున్నా ప్రభుత్వం తీరు మార్చుకోవడం లేదు. అర్థరాత్రి బుల్డోజర్లతో హెచ్‌సీయూలోకి ఎందుకు వెళ్తున్నారు? ఫ్యూచర్ సిటీకి 14 వేల ఎకరాలు ఉండగా, కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను ఎందుకు తీసుకుంటారు?‘ అని ప్రశ్నించారు. హెచ్‌సీయూ(HCU)లో వన్యప్రాణులు లేవని ప్రభుత్వం ఎలా చెబుతుందని నిలదీశారు. ‘ఈ భూములను ఎవరూ కొనొద్దు, కొంటే ఇబ్బందులు తప్పవు‘ అని హెచ్చరించారు. మంత్రులు విద్యార్థులను చులకనగా మాట్లాడుతున్నారని, హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదని ఆరోపించారు.
ఎకో పార్క్ ఏర్పాటు చేస్తాం..
‘మూడేళ్లలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అప్పుడు కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్క్(Eco Park) ఏర్పాటు చేసి, హెచ్‌సీయూకు కానుకగా ఇస్తాం. ఎవరైనా ఈ భూములు కొంటే వెనక్కి తీసుకుంటాం‘ అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వ భూములు ప్రజలవి, సీఎం కేవలం ధర్మకర్త మాత్రమే. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే కుదరదు‘ అని హెచ్చరించారు. రేవంత్ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.
దొడ్డి కొమురయ్యకు నివాళి..
తెలంగాణ ధీరుడు దొడ్డి కొమరయ్య(Doddi Komuraiah) జయంతి సందర్భంగా కేటీఆర్(KTR) ఆయనకు తెలంగాణ భవన్‌లో నివాళులు అర్పించారు. ‘దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన ఆయన తెలంగాణ పోరాటతత్వానికి నిదర్శనం‘ అని కొనియాడారు. ఈ వివాదంలో రేవంత్ ప్రభుత్వం వైఖరి మారకపోతే బీఆర్‌ఎస్ తీవ్ర పోరాటానికి సిద్ధమని కేటీఆర్ సంకేతాలు ఇచ్చారు.