Konda Murali Bold Statement: వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా తెరపైకి వచ్చారు కొండా మురళి. అంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శాయంపేట నియోజకవర్గ రాజకీయాలను ఆయన శాసించారు. కాలక్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఆయనకు విరోధం ఏర్పడింది. అది కాస్త తారాస్థాయి దాకా వెళ్ళింది. ఒకానొక దశలో కొండా మురళి ఇబ్బంది పడుతున్న క్రమంలో.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన భార్య కొండా సురేఖ శాయంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో కొండా మురళి ఎమ్మెల్సీ అయ్యారు. డిసిసిబి చైర్మన్ గా కూడా పనిచేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో కొంత కాలం పాటు కొండా సురేఖ ప్రయాణం చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో మురళి, సురేఖ గులాబీ కండువా కప్పుకున్నారు.
2018లో జన ఎన్నికల్లో కొండా సురేఖకు టికెట్ దక్కకపోవడంతో ఆమె తన రాజకీయ ప్రయాణాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కొనసాగించాల్సి వచ్చింది. ఇక ఇటీవల ఎన్నికల్లో కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ఆమె పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆమధ్య భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు పై కొండ సురేఖ చేసిన ఆరోపణలు తీవ్రస్థాయిలో దుమారం రేపాయి. తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత ఇటీవల మంత్రులు డబ్బులు తీసుకుంటారని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రకంపనలను సృష్టించాయి. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఆమెకు ఇబ్బంది తీసుకొస్తున్న క్రమంలో.. ఇటీవల కాలంలో ఆమె కాస్త నిశ్శబ్దంగా ఉన్నారు.
కొండా మురళి ఏమన్నారంటే..
గురువారం వరంగల్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో సురేఖ భర్త మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. చాలా రోజుల తర్వాత మురళి ఉత్సాహంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.” మంత్రి పదవి పోతుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. రేవంతన్న ఉండంగా, పైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఉండంగా కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోతుంది.. ఎక్కడికీ పోదు. అసలు ఆమెకు పైసలు వచ్చే శాఖలు లేవు. దేవాదా శాఖలో డబ్బులు రావు. పర్యావరణ శాఖలో పైసలు వచ్చే మార్గం లేదు. అటవీ శాఖ పూర్తిగా కేంద్రం ఆధీనంలో ఉంటుంది.
Also Read: Konda Surekha : కొండా సురేఖ కంటతడి.. అడ్డుగా నిలబడుతానంటున్న కేటీఆర్
కెసిఆర్ ఉన్నప్పుడు పర్యావరణ శాఖ పచ్చగా ఉన్నట్టు కనపడేది. ఆ తర్వాత అది మాయమైంది. కెసిఆర్ ఏదో భ్రమ కల్పించిండు. కొండా సురేఖకు నేనే నెలకు 5 లక్షల పంపిస్తా. ఆమె ఖర్చులకోసం ఉంటాయని డబ్బులు ఇచ్చేస్తా.” అని మురళి వ్యాఖ్యానించారు. ఇటీవల సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన కొండా సురేఖ ఇప్పుడు సైలెంట్ కాగా.. ఆమె భర్త కొండా మురళి మాత్రం ఒక్కసారిగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్యను ఉద్దేశించి, ఆమె మంత్రి పదవిని ఉద్దేశించి ఓపెన్ గా మాట్లాడేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను గులాబీ అనుకూల సోషల్ మీడియా విపరీతంగా వైరల్ చేస్తోంది. ఇటీవల సురేఖ.. ఇప్పుడు మురళి కేవలం డబ్బులు గురించి మాట్లాడుతున్నారని గులాబీ అనుకూల సోషల్ మీడియా వ్యాఖ్యానిస్తోంది.