Konda Surekha : కొండా సురేఖ కంటతడి.. అడ్డుగా నిలబడుతానంటున్న కేటీఆర్

ఓ కార్యక్రమంలో పాల్గొన్న సురేఖాకు ఎంపీ రఘునందన్ రావు చెల్లికి ఇచ్చినట్లుగా చేనేత నూలు దండ వేస్తే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదనకు గురయ్యారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు

Written By: Srinivas, Updated On : September 30, 2024 7:32 pm

Konda Sureka

Follow us on

Konda Surekha : వరంగల్ రాజకీయాల్లో కొండా సురేఖ ముద్ర అంతాఇంతా కాదు. అక్కడి ప్రజలకు ఆమె అన్నా.. ఆమె ఫ్యామిలీ అన్నా ప్రత్యేక అభిమానం. ఇంతింతై వటుడింతై.. అన్న చందంగా ఆమె రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు. మధ్యలో ఎన్నో ఒడిదుడుకులు సైతం ఎదుర్కొన్నారు. అలా అని ఎప్పుడూ రాజకీయాలను వదులుకోలేదు. నిత్యం ప్రజల మధ్యనే ఉండిపోయారు. ప్రజల సేవలోనే తరించారు. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కొండా సురేఖ ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే. గతంలో వైఎస్సార్ కేబినెట్‌లోనూ మంత్రిగా చేసిన ఆమె.. ఇప్పుడు రేవంత్ కేబినెట్‌లోనూ మంత్రిగా కొనసాగుతున్నారు.

నిత్యం సమీక్షలతో బిజీ అవుతున్న సురేఖ.. ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె ఒక్కసారిగా ఏడ్చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆమెను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో బ్యాడ్‌గా ప్రచారం చేస్తుండడమే ఇందుకు కారణం. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సురేఖాకు ఎంపీ రఘునందన్ రావు చెల్లికి ఇచ్చినట్లుగా చేనేత నూలు దండ వేస్తే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదనకు గురయ్యారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఖరిలో మార్పు తెచ్చుకోకుండా ఇలాగే వ్యవహరిస్తే ఊరుకునేది లేదని కూడా కొండా హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆమె కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ మీ ఇంట్లోని చెల్లిని కూడా ఇలాగే చేస్తే ఊరుకుంటారా అని నిలదీశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తనపై చేస్తున్న ప్రచారాన్ని కేటీఆర్‌కు, అతని చెల్లికి చూపించాలని, వాళ్లు కరెక్టేనని అంటారా అని ప్రశ్నించారు. కేటీఆర్‌కు కూడా ఓ చెల్లి ఉందని, ఆమె జైలుకు వెళ్తే తాము ఏమైనా పోస్టులు పెట్టామా అని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో ఉన్న మహిళలకు గౌరవం లేదని, అందులో ఉన్న సమయంలో తనను అవమానించారనే బయటకు వచ్చేశాసనని చెప్పారు.

కాగా.. బీఆర్ఎస్ సోషల్ మీడియాపై ఇప్పటికే సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసినట్లు కొండా సురేఖ వెల్లడించారు. ఇకనుంచి అలాంటి పోస్టులు పెడితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. దీనిని అటవీ జాతి ప్రవర్తన వర్ణించారు. సిగ్గు, లజ్జ ఉంటే బజారులో తిరుగు అంటూ సవాల్ చేశారు. కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే బట్టలిప్పించి ఉరికించి కొడుతామని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. మహిళలను అవమానించడమే బీఆర్ఎస్ సంస్కృతి అని అన్నారు.

మరోవైపు.. మూడు నాలుగు రోజుల అనంతరం అందుబాటులోకి వచ్చారు కేటీఆర్. వచ్చీరాగానే హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం అమాయక ప్రజల ఇళ్లు కూలుస్తున్నారని అన్నారు. ఎవరి కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ అంటున్నారని నిలదీశారు. పేదల ఇళ్లు కూలుస్తుంటే ఊరుకునేది లేదని, బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బుల్డోజర్లకు అడ్డంగా నిల్చుంటామని తెలిపారు. ఒకవేళ కూల్చాల్సి వస్తే ముందుగా హైడ్రా కమిషన్ కార్యాలయం, బుద్ధాభవన్‌ను కూల్చాలని సవాల్ చేశారు.