CM KCR First List  : 75 మందితో కేసీఆర్ తొలి జాబితా:  సిట్టింగ్ ల సంగతేంటి?

ముందే కొందరికి లోపాయికారీగా చెప్పడం, మరికొందరికి చెప్పకపోవడం ఎందుకని చర్చ జరుగుతుంది. అయితే గులాబీ బాస్ మాత్రం ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి వైపు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు 103 మందిలో కొందరికి మాత్రమే చెప్పి.. మరికొన్ని సీట్ల విషయంలో పెండింగ్ పెట్టాలనే ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది.

Written By: Bhaskar, Updated On : July 23, 2023 1:30 pm
Follow us on

CM KCR First List  : నవంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికారంలో ఉంది కాబట్టి భారత రాష్ట్ర సమితిలో కాస్త హడావిడి ఎక్కువగానే ఉంది. జాతీయ పార్టీగా పేరు మార్చుకున్న తర్వాత వచ్చే వారు పోయే వారితో అటు తెలంగాణ భవన్, ఇటు ప్రగతిభవన్ సందడిగా మారాయి. ఎన్నికల ముందు ఈ స్థాయిలో హడావిడి కామన్. కానీ రాజకీయ వర్గాల్లో భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ 75 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇందులో ఎవరి ఊహాగానాలు వారికి ఉన్నప్పటికీ.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల విషయంలో భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట మీద నిలబడతారా? లేదంటే మాట మారుస్తారా? అనేది అంత చిక్కకుండా ఉంది.
కొంతమంది మినహా దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని గతంలో మూడుసార్లు జరిగిన పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో కెసిఆర్ ప్రకటించారు. కొందరు ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడటం, కొన్ని నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాల వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సమావేశాల్లో ఈ ప్రకటనలు చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవని, సిట్టింగ్ లందరికీ టికెట్ దక్కే విషయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేల్లోనో అయోమయం ఉందని తెలుస్తోంది. సాధారణమైన సర్వేలతోపాటు భారత రాష్ట్ర సమితి చేయిస్తున్న సర్వేల్లో కూడా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు వెళ్లడవుతుండడమే ఇందుకు కారణమని సమాచారం. ఇలాంటి సందర్భాల్లో కొంతమంది ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు పిలిపించుకొని “ఇంత వ్యతిరేకత ఉంటే ఎట్లా” అంటూ గ్రహం వ్యక్తం సమాచారం. అదే కాదు ఆ సీట్లల్లో తానే పోటీ చేస్తానని, ఇటీవల కాలంలో రెండు సీట్ల పేర్లను కూడా ముఖ్యమంత్రి పార్టీ నేతల వద్ద చెప్పినట్లు సమాచారం. అయితే అధినేత వైఖరితో ఎమ్మెల్యేలు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. “వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే. అది కేవలం తమపైన కాదని, పార్టీ పై, ప్రభుత్వంపై కూడా ఉందని” సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటున్నారు. కేవలం తమపైనే  వ్యతిరేకత ఉందని ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా పార్టీపై, ప్రభుత్వంపై ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలిసినా.. కేవలం తమపైనే వ్యతిరేకత ఉందని చూపించి సీట్లకు ఎసరు పెడతారా? అన్న గుబులు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఏర్పడింది. మాకు మళ్ళీ అవకాశం ఇస్తారా? లేదా ప్రత్యామ్నాయం చూసుకోవాలా? అనే మీమాంసలో కొందరు ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం.
కాగా, భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల తొలిసారి జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్నది. ఆ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉంటారని తెలుస్తోంది. ఇది తొలి జాబితా అని భారత రాష్ట్ర సమితి బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ.. అంతర్గతంగా ఆయా అభ్యర్థులకు సమాచారం ఇస్తారని తెలుస్తోంది. ఆగస్టు మొదటి వారంలోనే ఈ సమాచారం అందించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షాల కంటే ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సంసిద్ధమనే సంకేతాలు ఇవ్వాలన్న యోచనతో ఆయన ఉన్నారని తెలుస్తోంది. కెసిఆర్ శ్రావణ మాస ముహూర్తం కోసం వేచి ఉన్నారని, ఈనెల 24న సూర్యాపేటలో బహిరంగ సభ ముగిసిన తర్వాత తొలి విడతగా సీట్లు ఇచ్చేవారికి ఆ విషయాన్ని వ్యక్తిగతంగా చెబుతారని తెలుస్తోంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేల మొత్తానికి టికెట్లు ఇచ్చే అవకాశం గనుక ఉండి ఉంటే.. ముందే కొందరికి లోపాయికారీగా చెప్పడం, మరికొందరికి చెప్పకపోవడం ఎందుకని చర్చ జరుగుతుంది. అయితే గులాబీ బాస్ మాత్రం ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి వైపు ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు 103 మందిలో కొందరికి మాత్రమే చెప్పి.. మరికొన్ని సీట్ల విషయంలో పెండింగ్ పెట్టాలనే ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది.