KCR's family is far from the election
KCR : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నెలకొన్న పరిస్థితులు భారత రాష్ట్ర సమితికి ఏమాత్రం కలిసి రావడం లేదు. కేసీఆర్ తుంటి ఎముక విరగడం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లో రెండు పిల్లర్లు కుంగిపోవడం, లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్టు కావడం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి రావడం, భారత రాష్ట్ర సమితి నాయకులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం.. ఇలా ఒకదానికి మించి మరొకటి భారత రాష్ట్ర సమితికి ప్రతిబంధకంగా మారాయి. దీంతో ఆ పార్టీ కని విని ఎరగని స్థాయిలో ఇబ్బందిని ఎదుర్కొంటోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అప్పటి ప్రభుత్వ పెద్దల మెడకు చుట్టుకోబోతోందని తెలుస్తోంది. ఒకవేళ ఈ కేసులో ప్రభుత్వం వేగంగా దర్యాప్తు చేస్తే.. కీలకమైన ఆధారాలు లభిస్తే అప్పుడు పరిస్థితి మరో విధంగా ఉంటుంది..
వరుస ప్రతిబంధకాలతో..
ఇక వరుసగా ఎదురవుతున్న ప్రతిబంధకాలతో కేసీఆర్ కుటుంబం ఈ పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉండనుంది. 2001 తర్వాత రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు పోటీ చేశారు. అయితే త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒక్కరు కూడా ఎన్నికల బరిలో నిలిచే అవకాశం కల్పించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నేపథ్యంలో క్యాడర్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే అదంతా ఊహాగానం మాత్రమేనని.. వారెవరూ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలుస్తోంది.
ఇదీ రాజకీయ చరిత్ర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన అనుభవం కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఉంది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేసి విజయం సాధించారు. సిద్దిపేట శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన మేనల్లుడు హరీష్ రావు పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం తారస్థాయిలో జరగడం.. 2006, 2008 ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కేసీఆర్ మళ్ళీ విజయం సాధించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్ రావు మరోసారి సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి లోక్ సభకు ఎంపికయ్యారు. సిద్దిపేట నుంచి శాసనసభకు హరీష్ రావు ఎంపికయ్యారు. ఆయనికల్లోనే కేసీఆర్ కుమారుడు కేటీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. సిరిసిల్ల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్ రావు, కేటీఆర్ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిరిసిల్ల నుంచి కేటీఆర్, సిద్దిపేట నుంచి హరీష్ రావు విజయం సాధించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావడంతో కేసీఆర్ ముఖ్యమంత్రయ్యారు.. హరీష్ రావు, కేటీఆర్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.
అప్పట్లో అలా ఉండేది
2014లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె ఎంపీగా నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఎన్నికయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కానీ 2019లో జరిగిన ఎన్నికల్లో కవిత నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. అనంతరం మరుసటి ఏడాది ఆమె భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి స్థానాల నుంచి పోటీ చేస్తే.. గజ్వేల్ లో మాత్రమే గెలుపొందారు. కేటీఆర్, హరీష్ రావు తమ స్థానాల నుంచి విజయం సాధించారు. ఇక త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదు. అప్పట్లో నిజామాబాద్ స్థానం నుంచి కవిత పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాదులో భారత రాష్ట్ర సమితి కొన్ని స్థానాలు మాత్రమే దక్కించుకుంది. అలాంటప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి ఎదురవుతుందని భావించి ఆమె వెనకడుగు వేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈలోగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె అరెస్టు కావడంతో.. ఇక కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేసే అవకాశం లేదని స్పష్టమైంది.