Ram Charan game changer : వెనుకటి రోజుల్లో ఒక సినిమాకు సంబంధించి పాటలు విడుదల చేస్తే.. ఎన్ని క్యాసెట్లు అమ్ముడుపోతే అంత రికార్డుగా చెప్పుకునేవారు. సినిమాలు సూపర్ హిట్ కాకున్నా.. పాటలు హిట్ అయ్యి ప్లాటినం డిస్క్ ఫంక్షన్స్ జరుపుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. కాలం మారిన తర్వాత.. ఇప్పుడు సినిమాలకు పాటలకు సంబంధించిన కొలమానం యూట్యూబ్ వ్యూయర్ షిప్పే. పాట విడుదలైన 24 గంటల్లో ఎన్ని వ్యూస్, ఎన్ని లైక్స్ వస్తే అంత గొప్ప.
ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమా నుంచి “జరగండి” అనే పాటను విడుదల చేశారు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను దలేర్ మెహంది, సునిధి చౌహన్ ఆలపించారు. తమన్ సంగీతం సమకూర్చారు. ఈ పాటను దాదాపు 18 కోట్లు ఖర్చుపెట్టి చిత్రీకరించామని ఈ సినిమా నిర్మాతలు ప్రకటించారు. నిర్మాతలు చెప్పినంత గొప్పగా ఈ పాట లేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ తేజ్ అభిమానులు ఈ పాట ఆయన స్థాయికి తగ్గట్టు లేదని చెబుతున్నారు. ” నాటు నాటు పాట ద్వారా రామ్ చరణ్ తేజ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆయన ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కొనసాగుతున్నారు. అలాంటిది శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో ఇంతటి తక్కువ ప్రమాణాలతో పాట ఉందంటే జీర్ణించుకోలేకపోతున్నామని”రామ్ చరణ్ అభిమానులు సామాజిక మాధ్యమ వేదికలలో వాపోతున్నారు. ఇంకా కొందరైతే శక్తి సినిమాలోని రామ చక్కని రసగుల్లా.. అనే పాటతో ఈ పాటను పోల్చుతున్నారు. ఆ పాట ప్రారంభంలో వినిపించే కోరస్ ను తమన్ ఈ పాట కోసం కాపీ కొట్టాడని ఆరోపిస్తున్నారు.
ఇక ఈ పాట విడుదలైన 24 గంటల్లో తెలుగులోకి వచ్చేసరికి 4.5 మిలియన్ వ్యూస్ నమోదు చేసుకుంది. 290 k లైక్స్ సొంతం చేసుకుంది. హిందీలో 310k వ్యూస్ నమోదు చేసింది..25k లైక్స్ సొంతం చేసుకుంది. తమిళంలో 510 k వ్యూస్ నమోదు చేసింది. 35k లైక్స్ సొంతం చేసుకుంది. వాస్తవానికి రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఉన్న నేపథ్యంలో ఈ స్థాయిలో వ్యూయర్ షిప్ నమోదు చేయడం పట్ల అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దసరా సమయంలోనే ఈ పాటను విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. కానీ తర్వాత ఎందుకో విరమించుకున్నారు. పాటలో నాణ్యతను మరింత పెంచేందుకే తాము ఇంత టైం తీసుకున్నామని నిర్మాతలు ప్రకటించారు. కానీ తీరా పాట విడుదలైన తర్వాత.. ఈ పాటలో నిర్మాతలు పెంపొందించిన నాణ్యత స్థాయి ప్రేక్షకులకు అర్థమైంది.