KCR: అరెస్ట్ కావాల్సిందే.. కేసీఆర్ కోరుకుంటున్నది అదేనా?

తెలంగాణ, ఏపీ సీఎంలు ఇద్దరూ ఇప్పుడు గత ప్రభుత్వాల నిర్ణయాలపై విచారణ జరుపుతున్నారు. రేవంత్‌రెడ్డి ప్రాజెక్టుల్లో అక్రమాలు, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అవకతవకలపై కమిషన్లు నియమించారు.

Written By: Raj Shekar, Updated On : June 27, 2024 3:19 pm

KCR

Follow us on

KCR: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు క్రమంగా తమిళనాడు రాజకీయాలను తలపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక.. అధికారం కోల్పోయిన వారిని వేధించడం, కేసులు పెట్టడం, అరెస్టు చేయడం తమిళనాడులో దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే సంస్కృతి వస్తున్నట్లు కనిపిస్తోంది. 2014లో టీడీపీ అధికారంలోకి రాగా, జగన్‌ అరెస్ట్‌ అయ్యారు. దీంతో 2019 ఎన్నికల్లో జగన్‌ సారథ్యంలో వైసీపీ ఘన విజయం సాధించింది. దీంతో జగన్‌ సీఎం అయ్యారు. 2023లో జగన్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేయించారు. దీంతో 2024 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి చంద్రబాబు సీఎం అయ్యారు. ఇక తెలంగాణలో 2014లో సీఎం అయిన కె.చంద్రశేఖర్‌రావు ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయించారు. దీంతో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు.

గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ..
తెలంగాణ, ఏపీ సీఎంలు ఇద్దరూ ఇప్పుడు గత ప్రభుత్వాల నిర్ణయాలపై విచారణ జరుపుతున్నారు. రేవంత్‌రెడ్డి ప్రాజెక్టుల్లో అక్రమాలు, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అవకతవకలపై కమిషన్లు నియమించారు. ఈ కమిషన్లు ఇప్పుడు విచారణ చేపడుతున్నాయి. అయితే కమిషన్ల నివేదిక ఆధారంగా కేసీఆర్‌ అరెస్ట్‌ అవుతారని ప్రచారం జరుగుతోంది.

అధికారులే సమిధలు..
కానీ, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్‌ మాజీ సీఎం కేసీఆర్‌ను అరెస్టు చేయకపోవచ్చన అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. అరెస్ట్‌ అయిన నేతలు వరుసగా ముఖ్యమంత్రి అవుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ అరెస్ట్‌ విషయంలో రేవంత్‌రెడ్డి పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే ఇప్పుడు కేసీఆర్‌కు ధైర్యం ఇస్తోంది. అయితే కమిషన్‌ విచారణ అనంతరం అరెస్ట్‌ అయ్యేది అధికారులే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పటికే అరెస్టులు..
తెలంగాణలో ఇప్పటికే అధికారులు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పలువురు పోలీస్‌ అధికారులు అరెస్టు అయ్యారు. ఇక గొర్రెల పంపిణీ పథకంలోనూ కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులోనూ అధికారులు అరెస్ట్‌ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాల విచారణలోనూ అధికారులే అరెస్ట్‌ అవుతారని తెలుస్తోంది. ఇందులో సీఎం కేసీఆర్‌ను అరెస్టు చేయకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.