Kavitha meet KCR : తన తండ్రి చుట్టూ బలమైన కోటరీ ఉందని.. ఆయన పక్కన దయ్యాలు ఉన్నాయని కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించాయి. పార్టీలో పరిస్థితులను ఆమె లెటర్స్ రూపంలో తన తండ్రికి రాస్తే.. అవి బయటికి వచ్చాయని.. అలా చేసిన వ్యక్తులు ఎవరని ఆమె ప్రశ్నించారు. లీకు వీరులు అని కూడా అభివర్ణించారు. కల్వకుంట్ల కవిత అనేక సందర్భాలలో పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై మాట్లాడిన నేపథ్యంలో.. ఒక్కసారి గా పరిణామాలు మారిపోయాయి. ఇక కల్వకుంట్ల కవిత ఆ స్థాయిలో ఆగ్రహంగా మాట్లాడినప్పటికీ తన తండ్రి నుంచి ఎటువంటి కబురు రాలేదు. పైగా ఆమెకు అపాయింట్మెంట్ కూడా లభించలేదని ప్రచారం జరిగింది. ఇక ఇదే సమయంలో గులాబీ అధినేత తనీరు హరీష్ రావు, గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో అనేక సందర్భాల్లో మాట్లాడారు. కానీ కల్వకుంట్ల కవితకు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు.
ఇక గురువారం కాలేశ్వరం కమిషన్ ఎదుట గులాబీ బాస్ హాజరయ్యారు. హాజరు కావడానికి ముందు ఆయన ఎరవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరారు.. దానికంటే ముందు కల్వకుంట్ల కవిత తన తండ్రితో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశం అయ్యారు. ఇటీవల జరిగిన అనేక పరిణామాల తర్వాత కల్వకుంట్ల కవిత తన తనని కలవడం ఇదే తొలిసారి. తన భర్త అనిల్ తో కలిసి ఆమె తన తండ్రిని కలిశారు. తన తండ్రితో కలిసి ఆమె బీఆర్కే భవన్ వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. కల్వకుంట్ల కవిత వెళ్లిన సమయంలోనే.. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడి కుమారుడు హిమాన్షు కూడా ఎర్రవల్లి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి జాగృతి అధినేత్రి ఎర్రవల్లి వెళ్లడం.. ఆమె వెంట భర్త అనిల్ కూడా ఉండడం సంచలనం కలిగిస్తోంది. ఇటీవల కాలంలో భారత రాష్ట్ర సమితిలో జరుగుతున్న పరిణామాలపై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ట్విట్టర్లో మాత్రమే స్పందిస్తున్నారని.. తన తండ్రికి నోటీసులు ఇస్తే నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అయితే ఇటీవలకల్వకుంట్ల కవిత చేపట్టిన ధర్నాలో కేవలం జాగృతి నేతలు మాత్రమే కనిపించారు. ఆ కార్యక్రమానికి భారత రాష్ట్ర సమితి నాయకులు దూరంగా ఉన్నారు. ఇక ఆ ధర్నా కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితికి సంబంధించిన ఒక జెండా కూడా ఎగరలేదు. కేవలం జాగృతి నాయకులు మాత్రమే అక్కడ కనిపించారు.. వారు మాత్రమే తమ జెండాలను ప్రదర్శించారు. అయితే ఉన్నట్టుండి కల్వకుంట్ల కవిత తన తండ్రిని కలవడం వెనక మతలబు ఏమిటి? అనేది అంతు పట్టకుండా ఉంది.
Also Read : కేసీఆర్ ఫాంహౌస్ కు వెళ్లిన కవిత
ఇటీవల కాలంలో కల్వకుంట్ల కవిత వేరే పార్టీ ఏర్పాటు చేస్తారని.. దానికి సంబంధించి సంప్రదింపులు కూడా జరుపుతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత అవన్నీ కూడా ఊహాగానాలు అని తేలిపోయింది. ఇక ఇటీవల పార్టిలో జరుగుతున్న పరిణామాలపై కల్వకుంట్ల కవిత అనేక సందర్భాలలో తనదైన శైలిలో విమర్శలు చేసినప్పటికీ.. తండ్రి నుంచి పిలుపు లభించలేదు. ఇక ఇటీవల తన కొడుకు గ్రాడ్యుయేషన్ డే నిమిత్తం శ్వేత దేశం వెళ్లి వచ్చిన జాగృతి అధినేత్రి.. శంషాబాద్ విమానాశ్రయంలో గులాబీ పార్టీ లో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆమె తన తండ్రిని కలవడానికి ఎర్రవల్లి వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే ఆమె తండ్రి నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆమె తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇన్ని రోజుల తర్వాత తర్వాత తన తండ్రిని కల్వకుంట్ల కవిత కలవడం ఇదే మొదటిసారి. అన్నట్టు జాగృతి అధినేత్రి వెళ్లిన సందర్భంలోనే కేటీఆర్ కుమారుడు కూడా ఎర్రవల్లి వెళ్లడం చర్చకు దారితీస్తోంది.