Kavitha Arrest: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో శుక్రవారం(మార్చి 15) మూడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మూడు పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇందులో మొదట చెప్పుకోవాల్సింది మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత అరెస్టు. రెండోది ప్రధాని నరేంద్రమోదీ రోడ్‌షో. ఇక మూడోది.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు. మూడు వేర్వేరు కార్యక్రమాలే అయినా మూడూ ఒకేరోజు జగరడం గమనార్హం.
కవిత అరెస్టు..
ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో దాదాపు రెండేళ్లుగా కవిత పేరు వస్తోంది. ఈ విషయమై రెండుసార్లు ఈడీ విచారణ కూడా ఎదుర్కొన్నారు కవిత. తర్వాత తెలుగు రాష్ట్రాలతోపాటు ఢిల్లీకి చెందిన నాయకులు అరెస్టు అయ్యారు. కొందరు అప్రూవర్‌గా మారి బెయిల్‌పై బయటకు కూడా వర్చారు. ఈ క్రమంలో మొదట ఈడీ కవితను సాక్షిగా చార్జిషీట్‌లో చేర్చి.. తర్వాత ముద్దాయిగా పేర్కొంది. తాజాగా ఈ కేసుపై దూకుడు పెంచిన ఈడీ కవితతోపాటు, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు పలుమార్లు నోటీసులు ఇచ్చింది. అయినా ఇద్దరూ స్పందించలేదు. తన పటిషన్ సుప్రీం కోర్టులో విచారణ ఉందని కవిత, వివిధ కారణాలతో కేజ్రీవాల్ విచారణకు డుమ్మా కొడుడతూ వచ్చారు. ఈ క్రమంలో కేసు విచారణ జరిగిన రోజే ఈడీ ఢిల్లీ అధికారుల బృందం హైదరాబాద్‌కు చేరుకుని కవితను అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఆమెను అరెస్టు చేసినట్లు ఈడీ ప్రకటించింది.
మధ్యాహ్నం నుంచి హైడ్రామా..
ఇదిలా ఉండగా శుక్రవారం మధ్యాహ్నం నుంచే కవిత ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందం కవిత ఇంట్లో సోదాలు చేసింది. సాయంత్రం 5:20 గంటలకు కవితకు నోటీసులు ఇచ్చి వాగ్మూలం నమోదు చేశారు. అనంతరం అరెస్టు చేశారు. ఈమేరకు కవిత భర్త అనిల్‌కు సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కవిత సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కవిత ఇంటికి చేరుకుని ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కానీ, ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకుని రాత్రి 8:45 గంటల ఫ్లైట్‌లో ఢిల్లీకి తీసుకెళ్లారు.
మోదీ రోడ్‌షో..
ఇక ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామాలు జరుగుతున్న సమయంలో దేశ ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌లోనే ఉండడం విశేషం. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కేరళ, తమిళనాడులో పర్యటించిన మోదీ, సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున భారీ రోడ్‌షో నిర్వహించారు. మీర్జాల గూడ నుంచి మల్కాజ్‌గిరి వరకు సుమారు 1.5 కిలోమీటర్లు సాగిన రోడ్‌షో.. సుమారు గంటపాటు సాగింది. అడుగడుగునా బీజేపీ శ్రేణులు, ప్రజలు మోదీకి స్వాగతం పలికారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ మోదీకి అభివాదం చేశారు. మోదీ కూడా అందరికి అభివాంద చేస్తూ ముందుకు సాగారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన రోడ్‌షో 7:30 గంటల వరకు సాగింది. ఈ సమయంలోనే ఈడీ కల్వకుంట్ల కవితను అదుపులోకి తీసుకున్నారు. ఇక రోడ్‌షో అనంతరం మోదీ రాజ్‌భవన్‌కు చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు.
రేవంత్ ఇఫ్తార్..
ఇక హైదరాబాద్‌లోనే జరిగిన మూడో కీలక కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు. శనివారం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ముస్లింకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ముస్లింలు హాజరయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామని సీఎం ప్రకటించారు. రిజర్వేషన్ల రద్దు మోదీ వల్ల కాదన్నారు. ఇదే సమయంలో తెలంగాణలో ఒక యూనివర్సిటీకి ముస్లింను వీసీగా నియమిస్తామన్నారు. మైనారిటీ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం ముస్లింలకు పండ్లు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు.