Chandrababu: తెలుగుదేశం పార్టీ రెండు జాబితాలను ప్రకటించింది. తొలి జాబితాలో 94 మంది.. రెండో జాబితాలో 34 మందిని ఖరారు చేసింది. ఇంకా పెండింగ్ లో కేవలం 16 స్థానాలు మాత్రమే ఉన్నాయి.అందులో శ్రీకాకుళం జిల్లాలో ఐదు స్థానాలను పెండింగ్ లో పెట్టారు.తొలి జాబితాలో ఇచ్చాపురం, టెక్కలి, ఆమదాలవలస, రాజాంను ఖరారు చేశారు. రెండో జాబితాలో బగ్గు రమణమూర్తి పేరును ప్రకటించారు. పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాలకొండ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సి ఉంది. దీంతో అక్కడ పార్టీ ఇన్చార్జిలు, ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది.
జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టిపట్టు ఉంది. గత ఎన్నికల్లో పది నియోజకవర్గాలకు గాను ఇచ్చాపురం, టెక్కలి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. మిగతా ఎనిమిది నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయింది. అయితే ఈసారి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో పాటు జనసేన తో పొత్తుతో దాదాపు అన్ని నియోజకవర్గాలను కైవసం చేసుకుంటామని తెలుగుదేశం పార్టీ ధీమాతో ఉంది. అందుకే అభ్యర్థుల ఎంపికలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. పారదర్శకంగా సర్వే చేపట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. గెలుపు గుర్రాలుగా నిలిచిన వారికే టికెట్లు కేటాయిస్తోంది.
అయితే జిల్లాలో ఏకంగా ఐదు అసెంబ్లీ స్థానాలను పెండింగ్లో పెట్టడాన్ని టిడిపి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీ వర్గాల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాన్ని బిజెపికి కేటాయిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై టిడిపి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అక్కడ మంత్రి ధర్మాన ప్రసాదరావు సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్నారు. మరోసారి వైసీపీ అభ్యర్థిగా ఆయనే బరిలో దిగుతారని తెలుస్తోంది. అక్కడ టిడిపి పటిష్ట స్థితిలో ఉంది. కానీ ఒక్క శాతం ఓటు కూడా లేని బిజెపికి అక్కడ టిక్కెట్ ఇస్తే.. ఫలితం ఉండదని.. టిడిపి క్యాడర్ చెబుతోంది. శ్రీకాకుళం నియోజకవర్గ టిడిపి శ్రేణులు ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంటిని కూడా ముట్టడించారు. ఈ సీటును ఎట్టి పరిస్థితుల్లో బిజెపికి కేటాయించవద్దని విజ్ఞప్తి చేశారు.
అయితే ఏకంగా ఐదు సీట్లను పెండింగ్లో పెట్టడం రకరకాల చర్చకు కారణమవుతోంది. అందులో రెండు స్థానాలు జనసేన, బిజెపికి కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడ టిడిపి ఇన్చార్జిలు, ఆశావహులు ప్రచారంలోకి వెళ్లలేకపోతున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. దీంతో టీడీపీ కేడర్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. అభ్యర్థుల విషయంలో వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. మొత్తానికైతే ఎన్నడూ లేనంతగా శ్రీకాకుళం జిల్లా టిడిపిలో ఉత్కంఠ కొనసాగుతోంది.