Kaushik Reddy: అప్పట్లో నా కాళ్లు మొక్కిండు.. రేవంత్ రెడ్డి పై సంచలన నిజం బయటపెట్టిన కౌశిక్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పీఏసీ చైర్మన్‌ నియామకం సందర్భంగా మాటలు చేతల వరకూ వచ్చాయి. పోలీసుల ఇరువర్గాలపై కేసులు నమోదు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Written By: Raj Shekar, Updated On : September 16, 2024 4:20 pm

Kaushik Reddy

Follow us on

Kaushik Reddy: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఏడాది కావొస్తున్నా.. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్ధి అని నేతలు చెబుతున్నా.. పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్తున్నారు. ఇప్పటికే పది మంది పార్టీ మారారు. ఇంకా ఎంత మంది మారతారో చెప్పలేని పరిస్థితి. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలని హైకోర్టు ఇటీవలే అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మరోమారు ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం.. కాస్త చేతల వరకు వెళ్లింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు చీరలు కట్టుకుని గాజులు వేసుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చీర, గాజులు చూపించారు. పీఏసీ చైర్మన్‌గా పారీ మారిన అరికెపూడి గాంధీని నియమించడంపై మండిపడ్డారు. తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానన్న అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లానని సవాల్‌ చేశారు. ఇక్కడే మాటలు కోటలు దాటి చేతల వరకు వెళ్లాయి. గాంధీ ఇంటికి వెళ్లకుండా పోలీసులు కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్నారు. తర్వాత గాంధీ తన అనుచరులతో కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. దీంతో ఇరు పక్షాల మధ్య దాడి జరిగింది.

సమర్థించిన సీఎం రేవంత్‌..
దాడిని సీఎం రేవంత్‌రెడ్డి మొదట కండించారు. దాడులతో బీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ ఇమేజ్‌ దెబ్బతీయాలని చూస్తోందన్నారు. దాడి అనంతరం పాడికౌశిక్‌రెడ్డి చేసిన ఆంధ్రా వ్యాఖ్యలను హైలెట్‌ చేశారు. ప్రజల మధ్య ప్రాంతీయ వాదం సృష్టించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అంతే కాకుండా పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్‌ బాధ్యతల స్వీకరణ సందర్భంగా గాంధీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి.. మరోమారు గాంధీ అనుచరులు చేసిన దాడిని సమర్థించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎవరి జోలికి వెళ్లరని, తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకోరని పరోక్షంగా గాంధీ పేరు ఎత్తకుండా మాట్లాడారు. ఇంటికి పిలిచి తన్నించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై పాడి కౌశిక్‌రెడ్డి స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి కోసం రేవంత్‌రెడ్డి తన కాళ్లు పట్టుకున్నాడని ఆరోపించారు. తనకుమద్దతు ఇవ్వాలని బతిమిలాడారని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం కాగానే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను సీఎంతో కాంప్రమైజ్‌ కానని స్పష్టం చేశారు. రేవంత్‌ను సీఎం పీఠం నుంచి దించే వరకూ పోరాడతానన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు స్థాయి కూడా రేవంత్‌కు లేదని విమర్శించారు. సీఎం వీధి రౌడీలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను హత్యకు గురైతే అందుకు రేవంత్‌రెడ్డే బాధ్యుడని స్పష్టం చేశారు.