Ganesh Chaturthi 2024: ఈ ఏడాది వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 7న ప్రారంభమైన వేడుకలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. పది రోజులుగా గజాననుడికి ఘనమైన పూజలు చేసిన భక్తులు.. నిమజ్జనానికి సన్నద్ధమవుతున్నారు. నిమజ్జన ఏర్పాట్లలో భక్తులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది కూడా విభిన్న రూపాల్లో గణనాథుడు భక్తుల పూజలందుకున్నాడు. అయితే ఈ ఏడాది కూడా కొన్ని వింతలు చోటు చేసుకున్నాయి. కొన్ని మండపాల్లో వినాయకుడికి కోతులు పూజలు చేయగా, కొన్ని మండపాల్లో గణపతి విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం అయింది. దీంతో వీటిని కూడా భక్తులు స్వామి మహిమగానే భావించారు. ప్రత్యేకంగా కొలిచారు. తాజాగా కోరుట్లలో మరో వింత చోటు చేసుకుంది.
గణపతి చేతిపై గరుడ..
జగిత్యాల జిల్లా కోరుట్ల భీమునిదిబ్బ ఏరియాలో నిర్వహిస్తున్న వేడుకల్లో భీమసేన యూత్ ఆధ్వర్యంలో భారీ గణపతి విగ్రహం ప్రతిష్టించారు. నిత్యం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. నిలబడిన వినాయకుడి రూపంలో ప్రతిష్టించిన గణపతి విగ్రహంపై ఆదివారం వింత చోటు చేసుకుంది. ఎక్కడో ఆకాశంలో ఎగిరే గరుడ పక్షి వచ్చి వినాయకుడి చేతిపై వాలింది. భక్తులందరూ చుట్టు పక్కల ఉన్న సమయంలోనే గరుడ పక్షి రావడంతో దానిని చూసిన భక్తులు పులకరించిపోయారు. స్వామివారి మహిమతోనే గరుడపక్షి వచ్చిందని భావిస్తున్నారు.
గరుడ రావడం అరుదే..
సాధారణంగా వినాయక మండపాల్లోకి కోతులు, కుక్కలు, ఆవులు, పాములు రావడం సహజమే. గరుడ పక్షులు మనుషులు ఉన్నప్పుడు కిందకు రావు. కానీ కోరుట్లలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్దకు భక్తులు ఉండగానే గరుడ పక్షి రావడం దేవుడి మహిమే అని పేర్కొంటున్నారు. పక్షికి మొక్కి.. దానిని చూడడం అదృష్టంగా భావిస్తున్నారు.