Tollywood: సామాజిక సేవలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. తనకు తోచిన మేర సహాయం చేస్తారు. కోవిడ్ సమయంలో చిరంజీవి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న నటులకు అవసరమైన వస్తువులు అందజేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఆక్సిజన్ సిలెండర్లు ఏర్పాటు చేశాడు. కాగా ఇటీవల ఏపీ/తెలంగాణలలో వరదలు సంభవించాయి. జనాలు తీవ్రంగా నష్టపోయారు.
విజయవాడ ముంపునకు గురైంది. పలువురు నిరాశ్రయులు అయ్యారు. ఈ క్రమంలో టాలీవుడ్ ముందుకు వచ్చింది. ఏపీ/ తెలంగాణా రాష్ట్రాలకు ఆర్థిక సహాయం ప్రకటించారు. కాగా మెగాస్టార్ చిరంజీవి ఏపీ/తెలంగాణలకు చెరో రూ. 50 లక్షలు ప్రకటించారు. ఈ మొత్తాన్ని చిరంజీవి చెక్ రూపంలో అందజేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసిన చిరంజీవి రూ. 50 లక్షల రూపాయల చెక్ అందజేశారు.
అలాగే అమర్ రాజా గ్రూప్ తరపున సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, మాజీ మంత్రి గల్లా జయదేవ రూ. 1 కోటి అందజేశారు. నటుడు ఆలీ రూ. 3 లక్షలు అందజేశారు. సాయి ధరమ్ తేజ్, విశ్వక్ సేన్ తో పాటు పలువురు నటులు తాము ప్రకటించిన మొత్తాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.
మరోవైపు చిరంజీవి విశ్వంభర మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం చిత్రీకరణ చివరి దశలో ఉంది. చిరంజీవి జన్మదినం పురస్కరించుకొని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. విశేష స్పందన దక్కింది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో విశ్వంభర తెరకెక్కిస్తున్నారు. చిరంజీవికి జంటగా త్రిష నటిస్తుంది. సురభి, ఈషా చావ్లా, ఆషిక రంగనాథ్ కీలక పాత్రలు చేస్తున్నారు.
యువీ క్రియేషన్స్ విశ్వంభర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించడం విశేషం. విశ్వంభర 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి.