Kalvakuntla Kavitha Game Plan: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్ని పార్టీలు రోడ్ల మీదికి వచ్చాయి. తెలంగాణ మొత్తాన్ని శనివారం బందుపెట్టాయి. పెట్రోల్ బంకులు ఓపెన్ చేసిన సరే రాజకీయ పార్టీలు ఊరుకోలేదు. రాళ్లతో, కర్రలతో దాడులు చేశాయి. కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే కమ్యూనిస్టుల వరకు అందరు నాయకులు రోడ్లమీదకి వచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. గులాబీ పార్టీ, కాంగ్రెస్, కమలం పార్టీ నాయకులు కొన్ని ప్రాంతాలలో పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. పరస్పరం కొట్టుకున్నారు. బీసీ బంద్ కార్యక్రమాన్ని తమ రాజకీయ ఉనికి కోసం ఉపయోగించుకున్నారు.
ఊరందరిది ఒక దారి అయితే.. తనది మరొక దారి అన్నట్టుగా.. బీసీ బంద్ కార్యక్రమంలో జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత సరి కొత్త స్కెచ్ అమలు చేశారు. బీసీ బందులో జాగృతి కార్యకర్తలు విస్తృతంగా పాల్గొన్నారు. కేంద్రానికి, రాష్ట్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కొన్ని ప్రాంతాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం కూడా చేశారు.
జాగృతి ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమంలో కవిత వేసిన మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయింది. ఎందుకంటే ఆ ఆందోళనలలో కల్వకుంట్ల కవిత పెద్ద కుమారుడు ఆదిత్య రావు పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవానికి కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రయాణాన్ని స్పష్టం చేయకముందే కొడుకును రంగంలోకి దించడం విశేషం. ఆదిత్య రావు విదేశాలలో చదువుకున్నాడు. ఇటీవల ఇండియాకు వచ్చాడు. ఆమధ్య కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్ళినప్పుడు కుటుంబానికి అండగా ఉన్నాడు. పలుమార్లు ఢిల్లీకి వెళ్లి తల్లిని పరామర్శించి వచ్చాడు. ఇప్పుడు ఏకంగా తల్లికి తోడుగా రోడ్డుమీదికి వచ్చాడు. తల్లి రాజకీయ పార్టీని ఏర్పాటు చేయకపోయినప్పటికీ.. తన వంతు బాధ్యతగా జాగృతి సంస్థ తరఫున ఆందోళనలో పాల్గొన్నాడు. వాస్తవానికి జాగృతి కొంతకాలంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. పూలే విగ్రహాన్ని అసెంబ్లీ లేదా సచివాలయంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది.