IND vs AUS 1st ODI: నేటి ఆధునిక క్రికెట్లో ఆస్ట్రేలియా, భారత్ సమఉజ్జీలు. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు పోటీ జరిగినా సరే నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. 2023లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత టీమిండియా.. ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. 2024 t20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాను ఓడించినప్పటికీ.. ఆస్ట్రేలియా జట్టును ఆస్ట్రేలియా గడ్డ మీద ఓడిస్తేనే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి లెక్క సరిపోతుందని సగటు భారత అభిమాని భావిస్తున్నాడు. అందువల్లే రేపటి నుంచి ప్రారంభమయ్యే సిరీస్ ఆసక్తికరంగా సాగుతుందని అంచనాలున్నాయి.
టీమిండియాలోకి విరాట్, రోహిత్ వచ్చేశారు. ఈసారి టీమిండియాను ఆస్ట్రేలియా సిరీస్లో ముందుండి నడిపించబోతున్నాడు. నాయకుడిగా అతడికి ఇది తొలి వన్డే సిరీస్. ఇప్పటికే అతడు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ద్వారా తను ఏమిటో నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టు మీద గిల్ వ్యక్తిగత ప్రదర్శన పర్వాలేదు. ఆస్ట్రేలియా గడ్డమీద చెప్పుకోదగ్గ స్థాయిలోనే పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్లో అందరి కళ్ళు గిల్ మీద ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. వన్డేలలో ఆస్ట్రేలియా, భారత్ మధ్య పోటీ ఎప్పుడు జరిగిన సరే నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. భారత్ అత్యంత బలవంతమైన జట్టుగా కనిపిస్తున్నప్పటికీ.. ఆస్ట్రేలియా దే ఇప్పటివరకు పై చేయిగా ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు పరస్పరం వన్డేలలో 152 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా 84 మ్యాచ్లలో గెలిచింది. ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ లో జరిగినప్పుడు కంగారు జట్టు 38 విజయాలు అందుకుంది. టీమిండియాలో వన్డే సిరీస్ జరిగినప్పుడు భారత జట్టు 33 విజయాలు సొంతం చేసుకుంది. మొత్తంగా చూస్తే ఆస్ట్రేలియా నే అప్పర్ హ్యాండ్ కొనసాగిస్తోంది.
2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఓటమి తర్వాత.. టీమిండియా ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు. టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా.. ఫైనల్ వెళ్ళిపోయింది. ఫైనల్ మ్యాచ్లో బలమైన దక్షిణాఫ్రికా ను ఓడించి విజేతగా నిలిచింది. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీ లోనూ టీమిండియా ఆస్ట్రేలియా విజయం సాధించి ఫైనల్ వెళ్లిపోయింది. తుది పోరులో న్యూజిలాండ్ జట్టును ఓడించి ట్రోఫీ సొంతం చేసుకుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా జట్టుపై ఇటీవల కాలంలో స్పష్టమైన లీడ్ కొనసాగిస్తూ వస్తోంది. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై అదే జోరు కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది.
ఇక ప్లేయర్ల వ్యక్తిగత ప్రదర్శనను లెక్కలోకి తీసుకుంటే.. టీమ్ ఇండియా ప్లేయర్లు ఘనమైన రికార్డులను కలిగి ఉన్నారు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2013లో ఆస్ట్రేలియా జట్టుపై 209 పరుగులు చేసి హైయెస్ట్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. ఉత్తమ సగటును హస్సి కొనసాగిస్తున్నాడు. ఇతడి సగటు 125.. అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (9) మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఒకటి ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ (16) ముందు వరుసలో ఉన్నాడు. అత్యధిక జట్టు స్కోర్ విభాగంలో టీమిండియా 399/5 మొదటి స్థానంలో ఉంది. బౌలింగ్ పరంగా మురళి విజయ్ (6/27) అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా బ్రెట్ లీ(55) కొనసాగుతున్నాడు. ఉత్తమ ఎకానమీ రేటు కలిగి ఉన్న బౌలర్ గా కపిల్ దేవ్ (3.67) కొనసాగుతున్నాడు.
జట్లపరంగా చూసుకుంటే రెండు టీంలు కూడా బలంగా కనిపిస్తున్నాయి.. ఆస్ట్రేలియా జట్టులో ఫిలిప్ (ఆల్ రౌండర్), హెడ్ (ఆల్ రౌండర్), లబు షాగ్నే, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, మిచెల్ ఓవెన్, కూపర్ కానోలి, మిచెల్ స్టార్క్, బార్ట్ లేట్, జోష్ హేజిల్ వుడ్, డ్వార్షుయిస్, ఎల్లిస్, కుహ్నేమన్ వంటి వారితో ఆస్ట్రేలియా జట్టు బలంగా కనిపిస్తోంది.
గిల్, రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, ధృవ్ జురెల్ వంటి వారితో టీమిండియా కూడా అత్యంత బలంగా ఉంది. మొత్తంగా చూస్తే రెండు జట్లలో యంగ్ ప్లేయర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో పోటీ హోరాహోరీగా సాగే అవకాశం ఉందని తెలుస్తోంది.