Hanumantha Rao Fell Down: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్ని పార్టీలు గళం ఎత్తాయి. రోడ్లమీదకి వచ్చి ధర్నాలు చేశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలు పెడితే ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి వరకు బీసీల కోసం పోరుబాట పట్టాయి. కొన్ని పార్టీలు మానవహారాలు నిర్మిస్తే.. కొన్ని పార్టీలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించకపోతే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించాయి.
వాస్తవానికి అన్ని పార్టీలు బీసీల కోసం సంఘటితంగా పోరాడుతుంటే.. మరి వ్యతిరేకంగా ఉన్నది ఎవరో అర్థం కావడం లేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన వెంటనే.. కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వారంతా న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో ఆ పిటిషన్లను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానాలు తీర్పులపై స్టే విధించాయి. దీంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కడం ఎండమావిగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా హైకోర్టులోనే మళ్లీ తేల్చుకుంటామని స్పష్టం చేస్తుండగా.. ప్రతిపక్ష గులాబీ పార్టీ మాత్రం బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుందని ఆరోపిస్తోంది. కమలం పార్టీ కూడా అదే పల్లవి అందుకుంటున్నది. ఈ విమర్శలు, ప్రతి విమర్శల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. శనివారం జరిగిన బందు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైంది.
బీసీల బంద్ కార్యక్రమంలో నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ముందుండి నడిచారు. హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఫ్లెక్సీ పట్టుకొని ముందుండి నడుస్తుండగా.. ఆయన కాలు చెప్పుకు ఫ్లెక్సీ తట్టుకోవడంతో ఒక్కసారిగా కింద పడి పోయారు. తారు రోడ్డు కావడంతో హనుమంతరావు కింద పడిపోయిన వెంటనే ఆయన నేత్రాలకు ఉన్న అద్దాలు పగిలిపోయాయి. దీంతో కార్యకర్తలు ఆయనను వెంటనే పైకి లేపి.. ఆస్పత్రికి తరలించారు. ఆయనకు స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది. కిందపడిన హనుమంతరావును కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు ఫోన్లో పరామర్శించారు.
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కావాలని హనుమంతరావు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల బీసీలు నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో ఆయన ముందు వరుసలో నడిచారు. 42 శాతం రిజర్వేషన్ల ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. అటువంటి నాయకుడు బిసి బందులో ముందు వరుసలో నడుస్తుండగా కింద పడిపోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.