Kavitha , Revanth Reddy : ఇటీవల తన ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు రేవంత్ కామెంట్స్ కాస్త రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీయడం ఏమో కానీ.. కేసీఆర్ ఫ్యామిలీలో మాత్రం రచ్చలేపినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆరు నెలలపాటు జైలులో ఉండి ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి వస్తున్న కవితకు.. రేవంత్ వ్యాఖ్యలు షాక్‌కు గురిచేశాయి. అటు.. ఫ్యామిలీలోనూ మంట రేపినట్లుగా తెలుస్తోంది.
మీడియా సమావేశంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు జైలుకెళ్లిన వారిలో చాలా మంది ముఖ్యమంత్రి అయ్యారట. కేటీఆర్ కూడా అదే సెంటిమెంటును నమ్ముతున్నాడట. అందుకే ఊకే దమ్ముంటే అరెస్ట్ చేయండి.. దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటూ మాట్లాడుకొస్తున్నాడు. మరి కేసీఆర్ ఫ్యామిలీలో కేటీఆర్ కంటే ముందు జైలుకు పోయింది ఆయన చెల్లి కవిత కదా. అయితే గిట్ల ఆమె సీఎం అవుతారు కానీ.. కేటీఆర్ ఎలా అవుతాడు. కేటీఆర్ ఈ మాత్రం లాజిక్ ఎలా మిస్సయ్యాడు’ అని వ్యాఖ్యలు చేశారు. తాను కూడా జైలుకు వెళ్లివస్తే సీఎంను అవుతానని కేటీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబంలోనే ముఖ్యమంత్రి కుర్చీ కోసం తీవ్ర పోటీ ఉందని అన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన తన చెల్లి ఎక్కడ సీఎం అవుతుందోనన్న భయం కేటీఆర్‌ను వెంటాడుతోందని అభిప్రాయపడ్డారు.
ఇటీవల కేటీఆర్ అరెస్టు తప్పదంటూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ-ఫార్ములా కారు రేసు కేసులో ఏసీబీ విచారణ జరుగుతోంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ఈ -కారు రేస్ కోసం గత ప్రభుత్వంలో రూ.55కోట్లు విదేశీ కంపెనీలకు మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఈ కేసులో అప్పటి ఐఏఎస్ అధికారిని దీనిపై వివరణ కోరితే గత ప్రభుత్వంలోని మున్సిపల్ శాఖ మంత్రి చెప్పినట్లుగా తాను చేశానని చెప్పుకొచ్చారు. అంటే.. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. ఆయన ఆదేశాల మేరకు రూ.55 కోట్లు విడుదల చేసినట్లు ఆ అధికారి తెలిపారు. దీంతో అప్పటి మున్సిపల్ మంత్రి అయిన కేటీఆర్‌ను ఈ కేసు విషయంలో విచారించాల్సి ఉంది. అయితే.. దీనికి సంబంధించి గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వం నుంచి లేఖ రాశారు. ఇంకా గవర్నర్ నుంచి ఆ లేఖకు రిప్లై రాలేదు. ఇక ఎప్పుడైతే ఈ కేసులో విషయంలో విచారణకు పిలిచి అరెస్టు చేస్తున్నారని తెలియడంతో కేటీఆర్ చేసిన హంగామా అంతాఇంతా కాదు. దమ్ముంటే అరెస్ట్ చేయండి.. ఎన్ని కేసులు పెడుతారో పెట్టుకోండి అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు తాము జైలుకు వెళ్లినా.. తమకూ ఒక రోజంటూ వస్తుందని బీరాలు పలికారు. కేటీఆర్ మాటలను ఉద్దేశించి రేవంత్ తన ప్రెస్‌మీట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనూ ఫ్యూచర్‌లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నిజంగానే కవితనే సీఎం అవుతారా అన్న చర్చ నడుస్తోంది.