Kaleshwaram Project is a Wonder: కాళేశ్వరం.. ఈ ఎత్తిపోతల పథకం గురించి తెలంగాణలో గత రెండు సంవత్సరాలుగా రాజకీయ కాక రేగుతోంది. ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం ఒక్కసారిగా రాజకీయంగా సంచలనం సృష్టించింది.
2023 లో కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న లోపం అప్పటి అధికార పార్టీకి ఇబ్బందికరమైన పరిణామం ఎదురైంది. దానిని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆయుధంగా మార్చుకుంది. మేడిగడ్డ కుంగుబాటుపై పదేపదే కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించడంతో ఒక రకంగా భారత రాష్ట్ర సమితికి ఈ వ్యతిరేకంగా మారింది. ఆ పార్టీ అధికారానికి దూరం కావడానికి ఇది కూడా ఒక కారణంగా నిలిచింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పై ప్రధానంగా దృష్టి సారించింది. అంతేకాదు కాళేశ్వరం నిర్మాణంలో కీలకంగా పనిచేసిన ఇంజనీర్ల పై ఏసీబీ చేసిన దాడుల్లో భారీగా ఆస్తులు బయటపడడంతో ప్రభుత్వం మరింత లోతుగా అడుగులు వేసింది. తద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి కీలక విషయాలు వెలుగు చూడటం మొదలైంది.. ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలపై ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నాడు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ ను విచారించింది. ఈ విచారణ తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించింది.. గులాబీ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత.. కమలం పార్టీలో చేరిన తర్వాత..కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై రాజేందర్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఆ పధకంపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఎప్పుడైతే కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిపించిందో.. అప్పుడే ఆయన స్వరం మార్చారని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు..
Also Read: Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కీలక మలుపు.. కేసీఆర్, హరీశ్‌కు నోటీసులు?
ఇక తాజాగా ఓ ముఖాముఖిలో ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు రాజేందర్ ఓపెన్ గానే సమాధానం చెప్పారు..” కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గొప్పది. దానిని నిర్మించడం వల్ల తెలంగాణ రాష్ట్రం బాగుపడింది. భూగర్భ జలాలు పెరిగిపోయాయి. పంటపొలాల సాగు పెరిగింది. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు అందాయి.. దీంతో పంటలు మెండుగా పండుతున్నాయి. భూగర్భ జలాలు పెరగడం వల్ల బోర్లలోకి నీరు తన్నుకొని వచ్చింది. నా నియోజకవర్గంలో అప్పుడు గోదావరి జిల్లాల రావడంతో రైతులు సంతోషపడ్డారు. పంటలు బాగా పండించుకున్నారు.కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గురించి తెలియని వారు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి వస్తే వారికి పరిస్థితి అర్థం అవుతుంది.కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై చేస్తున్న విమర్శలు సహేతుకమైనవి కావని” రాజేందర్ వ్యాఖ్యానించారు.. రాజేందర్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను గులాబీ పార్టీ నాయకులు తమ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు మా పార్టీకి ప్రత్యర్థి అయినప్పటికీ.. వాస్తవాలు చెప్పారని రాజేందర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.