Kaleshwaram Project: ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రచారం చేశారు. అయితే నిర్మించిన మూడేళ్లకే ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగాయి. అన్నారం బ్యారేజీ పిల్లర్ల వద్ద బుంగ పడింది. ఈ నేపథ్యంలో 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో విచారణకు ఆదేవించింది. విచారణకు కమిషన్‌ను నియమించింది.
Also Read: సీఎం రావాలె.. పెండ్లి కావాలె.. ఓ యువకుడి వింత కోరిక!
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ రేపటి నుంచి రెండో దశ దర్యాప్తును చేపడుతోంది. మొదటి దశలో ప్రాథమిక విచారణ పూర్తి చేసిన కమిషన్, ఇప్పుడు మరింత లోతైన పరిశీలనకు సిద్ధమైంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో సంబంధిత అంశాలపై దష్టి కేంద్రీకరించిన ఈ విచారణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి నీటిపారుదల మంత్రి హరీశ్‌రావులకు నోటీసులు జారీ కానున్నాయి.
నిర్ణయాలు, నిధులపై లోతైన ఆరా
ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసుకున్న నిర్ణయాలు, ఖర్చులు, ఒప్పందాలు, పనుల నాణ్యతను కమిషన్ సమగ్రంగా పరిశీలించనుంది. కోట్లాది రూపాయల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ ప్రాజెక్టులో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో, కమిషన్ గడువు మరో రెండు నెలలు పొడిగించే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.
నివేదికలు, క్రాస్ ఎగ్జామినేషన్
కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్), విజిలెన్స్ విభాగం నివేదికలు ప్రభుత్వానికి అందాయి. ఈ నివేదికలను అధ్యయనం చేసిన తర్వాత, ఇంజనీర్లు, అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఈ ప్రక్రియ అనంతరం కేసీఆర్, హరీశ్‌రావులను విచారణకు పిలిచే అవకాశం ఉంది.
రాజకీయ చర్చలకు కేంద్ర బిందువు
కాళేశ్వరం విచారణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారనుంది. ప్రజలలో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ఈ దర్యాప్తు కీలకమని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. విచారణ ఫలితాల ఆధారంగా తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది.
బీఆర్‌ఎస్ సభకు బ్రేక్..
తాజాగా కాళేశ్వరం కమిషన్ విచారణతో ఈనెల 27న నిర్వహించే బీఆర్‌ఎస్ సభకు బ్రేక్ పడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. విచారణ నేపథ్యంలో కేసీఆర్, హరీశ్‌రావు కమిషన్ ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీ పాతికేళ్ల సభకోసం విస్తృతంగా ఏర్పాటు చేస్తోంది. ఈ తరుణంలో విచారణ కమిషన్ రంగంలోకి దిగడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. మరి కమిషన్ నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలి. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ తదుపరి దశలో కీలక నిర్ణయాలు, బాధ్యుల గుర్తింపు రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వాతావరణంపై గణనీయ ప్రభావం చూపనున్నాయి.