IT Raids In Hyderabad: హైదరాబాదులో ఐటీ దాడుల కలకలం..

హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతానికి చెందిన షానవాజ్ కింగ్స్ ప్యాలస్ యజమానిగా సుపరిచితుడు. కింగ్స్ ప్యాలస్ పేరుతో అతడు రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్ వ్యాపారం చేస్తున్నాడు.

Written By: Suresh, Updated On : February 13, 2024 3:09 pm

IT Raids In Hyderabad

Follow us on

IT Raids In Hyderabad: పార్లమెంట్ ఎన్నికలకు ముందు హైదరాబాద్ మహానగరం మరోసారి వార్తల్లోకి ఎక్కింది.. హైదరాబాదులోని పాతబస్తీ ఏరియాలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఓ వ్యాపారి కార్యాలయాల్లో తనిఖీలు చేయడం మొదలుపెట్టారు.. స్థానిక పోలీసులను కాదని కేంద్ర భద్రత బలగాల సహాయం తీసుకొని ఆ వ్యాపారి ఇంట్లో తెల్లవారుజాము నుంచే తనిఖీలు ప్రారంభించారు. కార్యాలయాలు, ఆ వ్యాపారి ఇంటి గేటుకు తాళం వేసి అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతానికి చెందిన షానవాజ్ కింగ్స్ ప్యాలస్ యజమానిగా సుపరిచితుడు. కింగ్స్ ప్యాలస్ పేరుతో అతడు రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఆదాయపు పన్ను శాఖకు ఆదాయం వివరాలు చెప్పకపోవడంతో గతంలోనే ఐటి శాఖ అధికారులు ఆయన కార్యాలయాలపై దాడులు చేశారు. అయితే అధికారులు వస్తున్నారని సమాచారం ఆయనకు ముందే తెలియడంతో అప్పటికప్పుడు దుబాయ్ పారిపోయారు. కొంతకాలం పాటు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఇటీవల హైదరాబాద్ నగరానికి వచ్చారు. దీంతో సమాచారం తెలుసుకున్న ఐటీ అధికారులు ఆయన కార్యాలయాలు, ఫంక్షన్ హాల్స్, హోటల్స్ పై మంగళవారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేస్తున్నారు.

షానవాజ్ గతంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు బినామీగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి డబ్బు సర్దుబాటు చేస్తుండగానే ఐటీ శాఖకు సమాచారం రావడంతో తనిఖీలు చేసిందని తెలుస్తోంది. అయితే ఈ సమాచారం ముందుగానే తెలియడంతో అప్పట్లో షానవాజ్ దుబాయ్ వెళ్లిపోయారు.. ఐటి శాఖ అధికారులు అప్పటినుంచి ఇతడి కార్యకలాపాలపై ఒక నిఘా వేశారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు కూడా లెక్కకు మిక్కిలి ఆస్తులు కలిగి ఉండటంతో.. వాటి అసలు వివరాలు తేల్చడానికి ఐటి శాఖ అధికారులు రంగంలోకి దిగారు.. ప్రస్తుతం విలువైన డాక్యుమెంట్లు, బంగారం, పన్ను పరిధిలోకి రాని నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పాతబస్తీ ప్రాంతం కావడంతో కేంద్ర బలగాలు అక్కడ భద్రత నిర్వహిస్తున్నాయి. కాగా పాతబస్తీ ప్రాంతంలో ఐటి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలియడంతో ఒకసారిగా కలకలం చెలరేగింది.