HomeతెలంగాణCM Revanth Reddy: మోడీ విషయంలో కేసీఆర్ చేసిన తప్పే.. రేవంత్ కూడా చేస్తున్నారా?

CM Revanth Reddy: మోడీ విషయంలో కేసీఆర్ చేసిన తప్పే.. రేవంత్ కూడా చేస్తున్నారా?

CM Revanth Reddy: రాజకీయ నాయకులకు ముందు చూపు ఉండాలి. అధికారంలో ఉన్న వాళ్లకు అది మరింత ఎక్కువ ఉండాలి. వరుస ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన చిరకాలం అధికారంలో ఉంటారని కాదు. బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్లే అధికారం దక్కుతోందని రాజకీయ పార్టీలు భావించాల్సి ఉంటుంది. ఇలా అంచనా వేయకపోవడం వల్లే మూడోసారి కేసీఆర్ తెలంగాణలో అధికారానికి దూరమయ్యారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించి.. 2023 లో జరిగిన ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాల్సిన చోట బోల్తాపడ్డారు.. అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడాడు. అయితే బిజెపి విషయంలో ఆ స్థాయిలో దూకుడు చూపించలేకపోయాడు. చివరికి మోడీతో పెట్టుకుని కొరివితో తల గోక్కున్నాడు. రాజకీయాలలో కేసీఆర్ అపర చాణక్యుడని చాలామంది అంటారు. రాజకీయాల్లో ఆయనను మించిన తలపండిన నాయకుడు లేడని కొనియాడుతుంటారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన రాజకీయ చాణక్యం పనికి రాలేదు. తలపండిన ఆయన అనుభవం అక్కరకు రాలేదు. ఈడా బోడా? రా.. * అని సవాల్ విసిరితే.. ఈడీ వచ్చింది. తన కూతుర్ని అరెస్టు చేసి తీసుకెళ్లింది. పది రోజులపాటు కస్టడీలో ఉంచుకుంది. తర్వాత ఏం చేస్తుందనేది ఇప్పటికీ అంతు పట్టడం లేదు. ఒకవేళ కేసీఆర్ నడుము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీని సరిగ్గా అంచనా వేసి ఉంటే.. పకడ్బందీగా ప్రణాళికలు అమలు చేసి ఉంటే.. కేసీఆర్ కు ఈ రోజున ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని రాజకీయ విశ్లేషకులు భావన. “కానీ ఏం చేస్తాం.. అప్పుడు చెబితే కేసీఆర్ వినిపించుకోలేదు.. ఇప్పుడు చెప్పినా ఉపయోగం లేదని” ఆ పార్టీ నాయకులు నిట్టూర్చుతున్నారు.

ఇక గతంలో కేసీఆర్ చేసిన తప్పునే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు యాంటీ కేసీఆర్, యాంటీ బీఆర్ఎస్ కోణంలో మాత్రమే రేవంత్ రెడ్డి తన పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇంతవరకు ఆయన నరేంద్ర మోడీపై ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే విమర్శలు చేశారు. పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ రేవంత్ రెడ్డి ఇంతవరకు యాంటీ మోడీ కోణంలో ప్రచారం చేయలేదు. దీనివల్ల జరిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో కళ్ళ ముందు కేసీఆర్ రూపంలో సజీవ సాక్ష్యం కనిపిస్తూనే ఉంది. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి ఎంత త్వరగా మేలుకుంటే అంత మంచిది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందనే ఊహాగానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది..

ప్రస్తుతం రేవంత్ వ్యవహరిస్తున్న యాంటీ కేసీఆర్, యాంటీ బీఆర్ఎస్ దీర్ఘకాలం ప్రజల్లో భరోసా ఇవ్వలేవు. కొంతకాలం వరకు భావోద్వేగాలతో రాజకీయాలు నడపొచ్చు. గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాల మీద బండి లాగించవచ్చు. కానీ అంతిమంగా ప్రభుత్వం ఏం చేసిందనేదే ప్రజలు చూస్తారు. అంతేకాదు కేవలం కేసీఆర్ మీద టార్గెట్ చేస్తే.. బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదనే మాట కచ్చితంగా ప్రజల నుంచి వస్తుంది. అలాంటి ప్రశ్న ఎదురుగాకముందే తన చేతుల్లో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పై ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీ నిశ్శబ్దంగా ఉంటుందనేది అనుమానమే. మహారాష్ట్రలో ఆల్రెడీ శివసేనలో చీలికలు తెచ్చింది. బీహార్లో పాగా వేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ కింద మంటలు పెడుతూనే ఉంది. తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాన్ని స్టాలిన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది. కేరళ ప్రభుత్వాన్ని అదును చూసి దెబ్బ కొడుతోంది. సో ఎటు చూసుకున్నా మోడీ రాజసూయ యాగం దూకుడుగానే కొనసాగుతోంది. మరి దీనిని రేవంత్ ఎలా తట్టుకుంటారనేది చూడాల్సి ఉంది.

అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ వ్యతిరేక ప్రచారం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే ప్రచారం కొనసాగిస్తామంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే రాష్ట్రానికి, పార్లమెంటు ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పైగా కేసీఆర్ వ్యతిరేక ప్రచారం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసి రాదు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ కాబట్టి.. అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తేనే రేవంత్ కోరుకున్న 12 నుంచి 13 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయి. అప్పుడు రాష్ట్రంలో రేవంత్ నాయకత్వం మరింత బలపడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద రేవంత్ పలుకుబడి మరింత పెరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి కి లభించిన అంత స్వేచ్ఛ రేవంత్ కు లభిస్తుంది. ఇవన్నీ జరగాలంటే యాంటీ బీజేపీ కోణంలో, నరేంద్ర మోడీ కోణంలో రేవంత్ పయనం సాగించాలి. గట్టిగా ప్రచారం చేయాలి. లేకుంటే ఇంక చెప్పేదేముంది.. కళ్ళముందు సజీవ ఉదాహరణగా కేసీఆర్ కనిపిస్తుంటే..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular