ACB Raids: ఏసీబీ అధికారులు దాడులు చేసినప్పుడు.. అవినీతికి పాల్పడుతూ ప్రభుత్వ ఉద్యోగులు దొరికిపోయినప్పుడు.. సహజంగా మీడియా అవినీతి తిమింగలం.. అవినీతి చేపలు అంటూ రాస్తుంది. ఇందులో తిమింగలానికి, చేపలకు ఎలాంటి పాత్ర ఉందో తెలియదు గాని..మీడియా అలా రాస్తూ ఉంటుంది. సరే ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఏఈఈ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఇంతకీ అతడి ఆస్తులు ఎంత అంటే.. సారీ అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఏమిటంటే 150 కోట్లకు పై మాటేనట..
అతని పేరు నిఖేష్ కుమార్.. నీటిపారుదల శాఖలో ఏఈఈ గా పనిచేస్తుంటాడు. రంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తుంటాడు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి సదరు సారు.. చేతివాటానికి అలవాటుపడ్డాడు. అందిన కాడికి దోచుకోవడం మొదలు పెట్టాడు. అడ్డగోలుగా ఆస్తులు సంపాదించాడు. ఇతగాడి వ్యవహార శైలిపై ఇటీవల ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో వారు నిఘా పెట్టారు. ఫలితంగా ఏఈఈ అసలు వ్యవహారం బయటపడింది.. శనివారం ఉదయం 6 గంటల నుంచి అవినీతి నిరోధక శాఖ అధికారులు నిఖేష్ కుమార్ ఇంట్లో సోదాలు మొదలుపెట్టారు. అతడి బంధువులు, సన్నిహితులు మొత్తం కలిపి 30 చోట్ల అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం వ్యవసాయ క్షేత్రం తో పాటు భారీగా అగ్రికల్చర్ ల్యాండ్స్, భవనాలు ఉన్నట్టు అధికారుల తనిఖీల్లో తేలింది. బంగారం కేజీల కొద్దీ ఉన్నట్టు తెలుస్తోంది. ఏఈఈ ఆస్తుల విలువ బహిరంగ విపణి లో 150 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.
అప్పుడే అనుమానం
నిఖేశ్ కుమార్ వ్యవహార శైలిపై అధికారులకు 6 నెలల క్రితమే అనుమానం వచ్చింది . రంగారెడ్డి నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఓ వ్యక్తి వద్ద నుంచి 2.50 లక్షలు లంచం తీసుకుంటూ ఈ ఈ బన్సీలాల్, నిఖేష్ కుమార్, కార్తీక్ అనే అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. అప్పటినుంచి నిఖేష్ కుమార్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించారు. గతంలో తమకు లంచం తీసుకుంటూ దొరికినప్పుడు నిఖేష్ కుమార్ పై అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వారు ఇతడిపై నిఘా పెట్టారు. ఇక తమకు స్పష్టమైన సమాచారం రావడంతో రంగంలోకి దిగారు. అయితే ఆదివారం సాయంత్రం వరకు పూర్తిస్థాయిలో సమాచారం వస్తుందని.. అప్పుడు మొత్తం వివరాలు చెబుతామని అవినీతి నిరోధక శాఖ అధికారులు వివరిస్తున్నారు. నిఖేష్ గత ప్రభుత్వ ప్రజలతో అంట కాగేవాడని.. బిల్లుల చెల్లింపులో ఇష్ట రాజ్యాంగ వ్యవహరించే వాడని.. అందువల్లే భారీగా వెనకేసుకున్నాడని తెలుస్తోంది.. శనివారం పొద్దుపోయే వరకు భారీగానే ఆస్తులను గుర్తించామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా కొన్ని వివరాలు తెలియాల్సి ఉందని.. కొన్ని భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా వెలుగులోకి రావాల్సి ఉందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.