https://oktelugu.com/

Telangana Colleges: డబ్బులు లేవు రేపటి నుంచి బందే.. రేవంత్‌ సర్కారుకు ఇదో పెద్ద డ్యామేజ్‌!

తెలంగాణలో డిగ్రీ, పీజీ కాలేజీలు మూతపడ్డాయి. యాజమాన్యాల నిర్ణయంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. సెమిస్టర్‌ పరీక్షలపై సందిగ్ధం నెలకొంది.

Written By: Raj Shekar, Updated On : November 19, 2024 9:54 am
Telangana Colleges

Telangana Colleges

Follow us on

Telangana Colleges: తెలంగాణలో ఇప్పటికే వివిధ సమస్యలతో సతమతం అవుతున్న రేవంత్‌ సర్కార్‌కు మరో సమస్య వచ్చిపడింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీలు మూతపడ్డాయి. రెండేళ్లుగా తమకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయడం లేదని యాజమాన్యాలు నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ నిధులు రాకపోవడంతో కాలేజీలు నడపలేకపోతున్నామని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈమేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ జిల్ల బాలకిష్టారెడ్డిని కలిసి సమ్మె నోటీస్‌ ఇచ్చారు. అన్ని యూనివర్సిటీల పరిధిలోనూ ఆయా వర్సిటీల వీసీలకు సమ్మె నోటీస్‌ ఇచ్చారు. దీంతో అన్ని కాలేజీలు మూతపడ్డాయి. హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు ఇళ్లబాట పట్టారు.

హామీని నిలబెట్టుకోని సర్కార్‌..
దసరా సెలవుల తర్వాతనే డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నాలుగు రోజులు సమ్మె చేశాయి. రెండేళ్ల ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశాయి. అక్టోబర్‌ 14 నుంచి 17వ తేదీ వరకు కళాశాలలు తెరుచుకోలేదు. దీంతో దసరా సెలవులకు ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు కాలేజీలకు రాలేదు. సమ్మెపై స్పందించిన విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం నెల రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో యాజమాన్యాలు అక్టోబర్‌ 18 నుంచి కళాశాలలను తెరిచాయి. నవంబర్‌ 18తో ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసింది. నెల రోజుల్లో ఒక్క కళాశాలకు కూడా.. ఒక్క రూపాయి ఫీజు బకాయి కూడా చెల్లించలేదు. దీంతో కళాశాలల యాజమాన్యాలు మళ్లీ కాలేజీలు మూసివేశాయి.

సమయం ఇవ్వని సీఎం..
తెలంగాణలో ఉన్నత విద్యను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కొత్త ప్రభుత్వం వచ్చాక అయినా తమ కష్టాలు తీరుతాయని యాజమాన్యాలు భావించాయి. తమ బకాయిలు వస్తాయని ఆశించాయి. కానీ ఏడాది గడిచినా బకాయిలుపై రేవంత్‌ సర్కార్‌ స్పందించలేదు. మంత్రులు, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం ఉండడం లేదని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి సమస్యలు విన్నవిద్దామంటే.. ఆయన సమయం ఇవ్వడం లేదని ఆగ్రహంగా ఉన్నాయి. తమ గోడు వినే సమయం కూడా సీఎంకు లేదా అని ప్రశ్నిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ నిధులు రాకపోవడంతో 90 శాతం కాలేజీలు అధ్యాపకులకు 5 నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదని, భవనాల అద్దె చెల్లించడం ఇబ్బందిగా మారడంతో మూసివేయాలని నిర్ణయించామని పేర్కొంటున్నాయి.
సెమిస్టర్‌ పరీక్షలపై సంద్ధిం..
కాలేజీల బంద్‌ నేపథ్యంలో డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలపై సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం అన్ని యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ 3, 5 సెమిస్టర్‌ పరీక్షలు ఈ వారంలో జరగనున్నాయి. ఇక ఈనెల 21 నుంచి మహాత్మాగాంధీ, 26 నుంచి కాకతీయ, పాలమూరు యూనివర్సిటీల పరిధిలో పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. తెలంగాణ, శాతవాహన వర్సిటీల సెమిస్టర్‌ పరీక్షలు ఇదే నెలలో జరగనున్నాయి. మొదటి సెమిస్టర్‌ పరీక్షలు కూడా నవంబర్‌ చివరి వారంలో జరగాల్సి ఉంది. ఈ పరీక్షలు జరగకపోతే.. విద్యా సంవత్సరంపై ప్రభావం పడుతుంది.

రేవంత్‌ సర్కార్‌పై ప్రభావం..
ఫీజు బకాయిలు చెల్లించడంలో జరుగుతున్న జాప్యంతో రేవంత్‌ సర్కార్‌పై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి రెండేళ్ల బకాయిలు ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం కూడా ఏడాది క్రితం బకాయిలు చెల్లించలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తాజాగా ఏడాదిగా బకాయిలు విడుదల చేయలేదు. డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులంతా ఓటర్లే. చదువులకు ఆటంకం కలగితే దాని ప్రభావం ఎన్నికలపైనా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.