Justin Trudeau: తమ పాలనలో కొన్ని తప్పులు జరిగి ఉంటాయని, ఆ తప్పులకు తమను క్షమించాలని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. ఈమేరకు 7 నిమిషాల వీడియో విడుదల చేశారు. కొందరు దుర్మార్గులు వ్యవస్థలోని లోపాలను వాడుకొని ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. లోపాలను సరి చేయాలని కోరారు. అమాయకులైన వలస వాదులకు ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. కొందరు తమ లోపాలను వాడుకుని అవమానిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, డిప్లొమోలు పూర్తి చేయిస్తామని, పౌరసత్వం తేలిగ్గా లభిస్తుందని ఆశలు చూపి మోసం చేస్తున్నారని వెల్లడించారు. ఈ సమస్యలు పరిష్కరించేందుకు కొత్త పాలసీ తీసుకొచ్చామన్నారు. రాబోయే మూడేళ్లలో శాశ్వత, తాత్కాలిక నివాసాల కోసం కెనడాకు వచ్చే వలసవాదుల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తామని తెలిపారు. కోవిడ్ తర్వాత ఉద్యోగుల కొరతను అధిగమించే వలస విధానంలో చేసిన మార్పులు ఫేక్ కాలేజీలు, భారీగా కార్పొరేషన్లు స్వలాభం కోసం వాడుకుంటున్నాయని ఆరోపించారు. తాత్కాలిక ఉద్యోగులు కూడా తమ శ్రామిక శక్తిలో భాగమయ్యారని, ఇమ్మిగ్రేషన్ ప్లాన్ సమయంలో వారిని విస్మరించమని తెలిపారు.
డిమాండ్ ఆధారంగా వలస విధానం..
రాబోయే రోజుల్లో వలస విధానం డిమాండ్ ఆధారంగా మారుస్తామని ట్రూడో తెలిపారు. ప్రస్తుతం మౌలిక వసతులపై దృష్టి పెట్టామని, ఇది సమతుల్యంగా ఉండేలా చూసుకుంటామని వెల్లడించారు. కెనడాలోని అనేక పరిశ్రమలు, సంస్థలు వలస కార్మికులకు ఉద్యోగాలు ఇస్తున్నాయని తెలిపారు. అయితే ఆమేరకు దేశంలో హౌసింగ్, ఆరోగ్య సౌకర్యాలు, సోషల్ సర్వీస్ విస్తరించడం లేదని తెలిపారు. వలస విధానంలో తాజా మార్పులతో ఇక్కడి కమ్యూనిటీలు లక్షల కొద్దీ ఇళ్లు నిర్మించే అవకాశం ఉందని ట్రూడో వెల్లడించారు.
అద్దెల తగ్గింపు..
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను నియంత్రించడంతో టొరెంటో, వాంకోవర్ వంటి నగరాల్లో అద్దెల ధరలు తుగ్గుతున్నాయని తెలిపారు. 2025–27 మధ్య సరికొత్త వలస విధానాల ప్రకారం శాశ్వత నివాసదారుల పర్మిట్లను 21 శాతం తగ్గించనున్నట్లు వెల్లడించారు. తాత్కాలిక నివాస పర్మిట్ల సంఖ్యను 2026 నాటికి 40 శాతం తగ్గిస్తామని పేర్కొన్నారు. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో కూడా 10 శాతం కోత పెడతామని స్పష్టం చేశారు.
ట్రంప్ తరహా రాజకీయం..
అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయన వలసల నియంత్రణే తన లక్ష్యమని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకెళ్లి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కెనడా ప్రధాని కూడా ట్రంప్‌ను ఫాలో అవుతున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్‌లో కెనడాలో ఎన్నికలు జరుగనున్నాయి. ట్రూడోపై ప్రజలు ఇప్పటికే వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వలసల నియంత్రణ పేరుతో కొత్త రాగం అందుకున్నారు.