Traffic Rules : హైదరాబాద్ లో వాహనదారులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే ప్రస్తుతం కఠినతరం చేసిన ట్రాఫిక్స్ రూల్స్ కారణంగా మీకు ఇబ్బందులు తప్పవు. నిబంధనలు ఏమాత్రం అతిక్రమించినా ఇక కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే ట్రాఫిక్, పోలీస్ యంత్రాంగం హెచ్చరిస్తున్నది. హైదరాబాద్ లో నిత్యం పెరుగుతున్న వాహనాల రద్దీ ట్రాఫిక్ పోలీసులకు సవాళ్లు విసురుతూనే ఉంది. ఇందులో చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం మరింత ఇబ్బందికరంగా మారింది. కొంతమంది రెడ్ సిగ్నల్ వద్ద కనీసం వాహనాలు నిలపడం లేదు. రాంగ్ రూట్స్, యూటర్న్, నోపార్కింగ్, ఇలా నిబంధనలు అతిక్రమిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది మిగతా వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. దీనివల్ల ఒక్కోసారి ప్రమాదాలు ఎదురవుతున్నాయి. దీంతో గాయపడడమో, ప్రాణాలు కోల్పోవడమో జరుగుతున్నది. ఇక ఇవన్నీ గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు రూల్స్ కఠినతరం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. నిబంధనలు అతిక్రమించే వారిని ఊపేక్షించేది లేదని చెబుతున్నారు. ఇకపై ట్రాఫిక్ రూల్స్ లో కొన్ని మార్పులు చేయబోతున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చి నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటివరకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికే వారి లైసెన్సులు మాత్రమే రద్దు చేస్తున్నారు. ఇక మరికొన్ని రూల్స్ అతిక్రమించే వారి లైసెన్స్ లు రద్దు చేయాలని నిర్ణయించారు. ఇందులో రాంగ్ రూట్, అతివేగం వంటివి చేర్చనున్నారు. దీంతో పాటు ద్విచక్రవాహనదారులు హెల్మెట్, మిగతవారు సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ రద్దయ్యేలా న్యాయస్థానాల్లోచార్జీషీట్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. దీనిపై ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఈ ఫైల్ ఇప్పుడు రవాణా శాఖ వద్ద ఉంది. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
కొత్త రూల్స్ అమలు ప్రతిపాదనల ఫైల్ ప్రస్తుతం రవాణాశాఖకు పంపారు.ఇప్పటికే చాలా అంశాల్లో ప్రస్తుత ప్రభుత్వం సీరియస్ గా వర్క్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఓకే చెప్పే అవకాశమే ఎక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వం నుంచి అనుమతిరాగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇక ట్రాఫిక్ రూల్స్ కఠినతరం కానున్నాయి. మరి హైదరాబాద్ లో వాహనదారులు ఇక కొంత జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే కొత్త ట్రాఫిక్ రూల్స్ లో చిక్కుకుంటే ఇక మీకు ముప్పే. హైదరాబాద్ తో మొదట అమలుచేశాక ట్రాఫిక్ ఎక్కువగా ఉండే మిగితా ప్రాంతాలకు కూడా ఈ నిబంధనలను విస్తరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది.
నిజానికి బెంగళూరు లాంటి సిటీతో పోల్చుకుంటే హైదరాబాద్ లో కొంత ట్రాఫిక్ రూల్స్ అమలు తక్కువగానే ఉంటుంది. ఇక్కడి పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తారనే పేరుంది.కానీ ఇటీవల పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు రూల్స్ మార్చక తప్పడం లేదు. దీని పై ప్రభుత్వం కూడా రవాణాశాఖకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం ఉంది. అడ్డదిడ్డంగా వాహనాలు నడిపేవారిపై సీరియస్ యాక్షన్ ఉండాలని అధికారులు యోచిస్తున్నారు. రాంగ్ రూట్, రాష్ డ్రైవింగ్ తో సహా మరే నిబంధనలు అతిక్రమించినా ఇక చట్టపరంగా తీవ్ర చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుంది. ఒక్కసారి లైసెన్స్ రద్దయితే ఏం జరుగుతుందో తెలుసు కదా.. అందుకే వాహనదారులు అప్రమత్తంగా వాహనాలు నడపడమే మంచిది.