YCP party : సంక్షోభం దిశగా వైసిపి.. ఏడుగురు రాజ్యసభ సభ్యులు గుడ్ బై.. ఈరోజు ఇద్దరు రాజీనామా

ఎన్నికల్లో ఓటమితో వైసిపి కష్టాల్లో ఉంది.ఇప్పుడిప్పుడే తేరుకునే ప్రయత్నం చేస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రాజ్యసభ సభ్యులు ఆ పార్టీకి షాక్ ఇస్తున్నారు.

Written By: Dharma, Updated On : August 29, 2024 12:17 pm

YCP Rajyasabha members Resign

Follow us on

YCP party : వైసిపి మరో సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.175 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాలకి ఆ పార్టీ పరిమితం అయింది.నాలుగు పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకుంది.కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది.అయినా సరే తమకున్న రాజ్యసభ సభ్యులు 11 మంది, లోక్సభ సభ్యులు నలుగురు,ఎమ్మెల్సీలు 38 మందితో కూటమిని గట్టిగానే ఎదుర్కోవాలని జగన్ భావించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని తమ పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు. ఓటమి నుంచి తీరుకుంటున్న జగన్ ఇప్పుడిప్పుడే ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడడం ప్రారంభించారు. 2029 ఎన్నికల నాటికి విజయం దిశగా అడుగులేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు మోపిదేవి వెంకటరమణ తో పాటు బీద మస్తాన్ రావు పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తరువాత వారిద్దరూ టిడిపిలో చేరతారని సమాచారం.టిడిపిలోకి వెళ్లిన తర్వాత రాజ్యసభ స్థానాలకు రాజీనామా చేస్తారని.. ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే వారిని నిలబెట్టేందుకు టిడిపి సమ్మతించినట్లు తెలుస్తోంది.రాజ్యసభలో టిడిపికి కనీస ప్రాతినిధ్యం లేకపోవడంతో.. వారితో రాజీనామా చేయించి.. ఆ స్థానాల్లో వారిని నియమించి టిడిపి నుంచి ఎన్నికయ్యేలా చేయాలన్నది ప్లాన్.ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ నుంచి ఏడుగురు రాజ్యసభ సభ్యులు బయటకు వెళ్తారని తెలుస్తోంది.అదే జరిగితే వైసీపీలో పెద్ద సంక్షోభం నెలకొన్నట్టే.అయితే పార్టీ నుంచి బయటకు వెళ్లినవారు ఏడుగురు కాదని..ఏకంగా తొమ్మిది మంది వెళ్తారని టాక్ నడుస్తోంది.

* ఆ ఇద్దరిలో అసంతృప్తి
బీద మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలోనే సుదీర్ఘకాలం కొనసాగారు. ఆయన సోదరుడు బీదా రవిచంద్ర ఇప్పటికీ టిడిపిలోనే ఉన్నారు. అప్పట్లో మస్తాన్ రావు పై ఒత్తిడి చేసి పార్టీలో చేర్చుకున్నారు. రాజ్యసభ సీటు ఇచ్చారు. కానీ ఆయన కూటమి గెలిచిన వెంటనే టిడిపిలోకి వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.కానీ సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రచారం జరిగింది.ఇప్పుడు చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో టీడీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మోపిదేవి వెంకటరమణ రేపల్లె అసెంబ్లీ సీటును అడిగారు. కానీ జగన్ అంగీకరించకపోయేసరికి అసంతృప్తితో ఉన్నారు. కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన టిడిపిలో చేరేందుకు మొగ్గు చూపారు.

* ఏకంగా ఏడుగురు
వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన అయోధ్య రామిరెడ్డి,గొల్ల బాబురావు, పిల్లి సుభాష్ చంద్రబోస్,నిరంజన్ రెడ్డి, పరిమల్ నత్వాని ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీలో కొనసాగే అవకాశాలు లేవని తెలుస్తోంది. వీరిపైకూటమి పార్టీల నుంచి ఒత్తిడి ఉంది. ఇందులో కొందరికి వ్యాపారాలు కూడా ఉన్నాయి. అందుకే వీరంతా భయపడుతున్నట్లు తెలుస్తోంది. కూటమి పార్టీల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే పేరుకే వీరు రాజ్యసభ సభ్యులు కానీ.. పార్టీలు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో పార్టీ వీడడమే ఉత్తమమని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

* గత ఐదేళ్లుగా హవా
గత ఐదేళ్లలో పార్లమెంటులో వైసిపి హవా నడిచింది. వైసిపికి ఉన్న సంఖ్యాబలం చూసి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది. అయితే ఎక్కువ మంది ఎంపీలు ఉండడంతో రాజ్యసభ సభ్యులకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. అటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం వీరి ప్రమేయం ఉండేది కాదు. దీంతో చాలామంది అసంతృప్తితో గడిపారు. కేవలం పదవి అన్నట్టు వ్యవహరించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతఇస్తామని హామీ ఇవ్వడంతో ఆ పార్టీల్లో చేరేందుకు సిద్ధపడుతున్నారు. అదే జరిగితే వైసీపీసంక్షోభంలో పడినట్టే.