HomeతెలంగాణHyderabad issues : హైదరా‘బాధ’

Hyderabad issues : హైదరా‘బాధ’

Hyderabad issues: హైదరాబాద్‌ విశ్వనగరంగా గుర్తింపు పొందింది. అనేక మల్టీనేషనల్‌ కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయి. భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. చిన్నపాటి వర్షం పడినా.. నగరవాసులు బాధ వర్ణనాతీతం. తాజాగా శుక్రవాపం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కురిసిన కుండపోత వర్షాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. సికింద్రాబాద్‌లోని బోయిన్పల్లిలో 12 సెం.మీ., కంటోన్మెంట్‌ పికెట్‌లో 11.5 సెం.మీ. వర్షపాతం నమోదవగా, నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ భారీ వర్షాలు నగర జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి, రహదారులపై వరద నీరు నిలిచి ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో నగరవాసులు ట్రాఫిక్‌లో చిక్కుకుని ప్రత్యక్ష నరకం చూశారు.

Also Read: అంత మంచోడిని కాను.. కేసీఆర్ చెప్పినా వినని స్థాయికి కేటీఆర్

నగరం అస్తవ్యస్తం..
వర్షాల ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. మాదాపూర్, హైటెక్‌ సిటీ, కూకట్పల్లి, సికింద్రాబాద్, బంజారాహిల్స్, మెహిదీపట్నం వంటి ఐటీ కారిడార్‌లోని ప్రాంతాలు ట్రాఫిక్‌ సుడిగుండంలో చిక్కుకున్నాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. స్కూల్‌ బస్సులు, ఆటోలు, మరియు ఇతర వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ప్యాట్నీ నాలా వంటి నీటి కాలువలు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగాయి. వరద సమస్యలను ఎదుర్కొనేందుకు హైడ్రా, జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌ శాఖ, పోలీస్, జలమండలి శాఖల మధ్య సమన్వయం లోపించింది. సహాయక చర్యలు ఆలస్యం కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బోట్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ, రహదారులపై నిలిచిన వరద నీరు, షోరూమ్‌లు, పరిశ్రమల్లోకి చేరిన నీరు సమస్యలను మరింత తీవ్రతరం చేశాయి. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సైతం సీలింగ్‌ నుంచి నీరు కారడంతో కంప్యూటర్లు పాడవడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ప్రమాదాలు. నష్టాలు
భారీ వర్షానికి నాదర్గుల్‌లో గోడ కూలి ఓ మహిళ మృతి చెందగా, అంబర్‌పేటలో వరద నీటిలో కారు కొట్టుకుపోయింది. నగరవ్యాప్తంగా 270 విద్యుత్‌ ఫీడర్లలో అంతరాయం ఏర్పడి, అమీర్పేట, మలక్‌పేట, హబ్సిగూడ వంటి ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చెట్ల కొమ్మలు పడటం, ట్రాన్స్‌ఫార్మర్లలో సాంకేతిక లోపాలు విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు ఆటంకం కలిగించాయి. ముషీరాబాద్‌లో నాలా పొంగడంతో ఓ ఇంటి ప్రహరీ గోడ కూలి, 9 కుటుంబాలను ఖాళీ చేయించాల్సి వచ్చింది. వాతావరణ కేంద్రం రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేయడంతో నగర పరిపాలన సంస్థలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Also Read: వృత్తినే ఇంటిపేరుగా మార్చుకున్నాడు.. ఫిష్ వెంకట్ మృతికి కారణమిదే…

హైదరాబాద్‌లో కురిసిన రికార్డు స్థాయి వర్షాలు నగర పరిపాలనా వ్యవస్థల లోపాలను బహిర్గతం చేశాయి. నీటి కాలువల నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థల లోపాలు, విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం వరద సమస్యలను తీవ్రతరం చేశాయి. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్యలు, విద్యుత్‌ అంతరాయాలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు నగరవాసుల జీవనాన్ని దెబ్బతీశాయి. రాబోయే రోజుల్లో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో, జీహెచ్‌ఎంసీ, ఇతర సంస్థలు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular