Kavitha interesting tweet: మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
హరీష్ రావు తన కుటుంబంతో కలిసి కొండాపూర్ లోని క్రిన్స్ విల్లాస్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. తన తల్లిదండ్రులను కూడా ఆయన అక్కడే ఉంచుకుంటున్నారు. సత్యనారాయణ రావు వృద్ధాప్యంతో బాధపడుతున్న నేపథ్యంలో హరీష్ రావు ఆయనను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన నేపథ్యంలో.. సత్యనారాయణ రావు పార్థివదేహాన్ని హరీష్ రావు నివాసం ఉంటున్న విల్లా ప్రాంతంలో సందర్శనార్థం ఉంచారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సత్యనారాయణ రావు పార్థివ దేహాన్ని సందర్శించి.. నివాళులర్పించారు.
కెసిఆర్ కుటుంబంలో అత్యంత కీలకమైన కవిత కూడా సత్యనారాయణ రావు మృతి నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ నుంచి మొదలు పెడితే కేటీఆర్ వరకు సత్యనారాయణ రావు ఫోటో పోస్ట్ చేసి.. హరీష్ రావు కు సానుభూతి తెలియజేస్తే.. కవిత మాత్రం ఎటువంటి ఫోటో పోస్ట్ చేయకుండానే.. హరీష్ రావుకు సానుభూతి వ్యక్తం చేశారు. సత్యనారాయణ రావు మృతి పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవిత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జనంబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితిలో కొంతమంది నాయకులు మీద ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై కూడా ఆమె పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇటీవల పలుమార్లు విలేకరుల సమావేశంలో మాట్లాడిన కల్వకుంట్ల కవిత నీటిపారుదల శాఖ మాజీమంత్రి హరీష్ రావు మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం విశేషం. ఆయన అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ కూడా చేశారని సంచలన ఆరోపణలు చేశారు కవిత. కవిత ట్వీట్ చేసిన నేపథ్యంలో నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో విభేదాలను పక్కనపెట్టి హరీష్ రావును పరామర్శించాలని కవితకు సూచిస్తున్నారు. అయితే కవిత మాత్రం నిజామాబాద్ పర్యటనలో ఉన్నారు.
మాజీ మంత్రి హరీశ్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావు గారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను.
సత్యనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్ రావు గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 28, 2025