TRP Ratings: చెరుకూరి రామోజీరావు ఆధ్వర్యంలో ఏర్పాటయింది ఈటీవీ. ఇటీవల 30 సంవత్సరాలు పూర్తి కూడా చేసుకుంది.. గత దశాబ్ద కాలాన్ని పక్కన పెడితే.. అంతకుముందు సంవత్సరం మొత్తం తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగాన్ని మొత్తం ఈటీవీ శాసించింది. జెమినితో పోటీపడి తిరుగులేని స్థానాన్ని అందుకుంది. ముఖ్యంగా సీరియల్స్ విభాగంలో ఈటీవీ సరికొత్త చరిత్ర సృష్టించింది అని చెప్పవచ్చు. లేడీ డిటెక్టివ్, అంతరంగాలు, శాంతినివాసం, ఇది కథ కాదు, మనో యజ్ఞం, అన్వేషిత, అందం, మాతృదేవత.. ఇలాంటి సీరియల్స్ తో ఈటీవీ తెలుగు ప్రేక్షకుల మనసులు చెరగని స్థానాన్ని సంపాదించుకుంది.
ఎన్నో అద్భుతాలు.. మరెన్నో ఘనతలు అందుకున్న ఈటీవీ కొంతకాలంగా అనుకున్న స్థాయిలో రేటింగ్స్ అందుకోలేకపోతోంది. దీనికి తోడు పోటీ చానల్స్ వినూత్నమైన కార్యక్రమాలను రూపొందిస్తున్న నేపథ్యంలో ఈటీవీ తన స్థానాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదట్లో రెండోస్థానం.. ఇప్పుడు మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇన్నాళ్లకు ఈటీవీ కి మంచి రోజులు వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా విడుదలైన రేటింగ్స్ లో ఈటీవీ పోటీ చానల్స్ అయినా జెమిని, స్టార్ మా, జీతెలుగును పక్కనపెట్టి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఓవరాల్ రేటింగ్స్ లో కాదు.. ఒక సినిమా విషయంలో ఈటీవీ అద్భుతమైన రికార్డ్స్ అందుకుంది.
నాని ప్రొడ్యూసర్ గా కోర్టు అనే సినిమా నిర్మించాడు. ఈ సినిమాలో ప్రియదర్శి ముఖ్యపాత్రలో నటించాడు. అకారణంగా పెట్టే కేసుల వల్ల సామాన్యులు ఎలా ఇబ్బంది పడతారు.. అనే కోణాలను స్పృశిస్తూ ఈ సినిమా ను నిర్మించారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రసార హక్కులను ఈటీవీ దక్కించుకుంది. ఇటీవల ఈటీవీలో ఈ సినిమా ప్రసారమైంది. అర్బన్ ఏరియాలో 5.69, అర్బన్, రూరల్ ఏరియాలో 5.92 రేటింగ్స్ సాధించింది. స్టార్ మా లో ప్రసారమైన పుష్ప పార్ట్ 1 అర్బన్ ఏరియాలో 2.76, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలో 2.40, జీ తెలుగులో సంక్రాంతి వస్తున్నాం అర్బన్ ఏరియాలో 3.65, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలో 2.86, జెమినీలో మహర్షి అర్బన్ ఏరియాలో 3.11, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలో 3.13 రేటింగ్స్ సొంతం చేసుకున్నాయి. ఇటీవల ఈ నాలుగు సినిమాలు ఒకేసారి టెలికాస్ట్ అయ్యాయి. అయితే ఇందులో కోర్టు సినిమా హైయెస్ట్ రేటింగ్స్ సొంతం చేసుకోవడం విశేషం.
ఇక ఇటీవల కాలంలో ఈటీవీ యాజమాన్యం ఈటీవీ విన్ అనే యాప్ ను రూపొందించింది. లిటిల్ హార్ట్స్, #90’s అనే సినిమాలను నిర్మించింది. ఇవి రెండు ఈటివి విన్ కు విపరీతమైన పేరు తీసుకొచ్చాయి. ఈ తరహా సినిమాలను నిర్మిస్తూ ఈటివి యాజమాన్యం తన అభిరుచిని చాటుకుంటున్నది. కథా బలంతో.. సినిమాలు నిర్మించే ఈటీవీ.. ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగిస్తోంది. తనకంటూ సొంత ప్రేక్షకుల బలాన్ని మరింత పెంచుకుంటున్నది.