Chandrababu Cyclone Montha: సంక్షోభాలను అధిగమించి వచ్చిన నేత చంద్రబాబు. ఎన్నెన్నో విపత్తులను కూడా ఆయన ఎదుర్కొన్నారు. అందుకే జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందారు. ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఒడిస్సాకు పెను విపత్తు వచ్చింది. ఆ సమయంలో నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. అప్పట్లో ఒడిస్సా బాధితులకు సహాయ చర్యలు చేపట్టడంలో ఏపీ ముందు వరుసలో నిలిచింది. ఇప్పటికీ ఒడిస్సా వాసులు దానిని గుర్తు చేసుకుంటారు. చంద్రబాబు హయాంలో వచ్చిన అన్ని తుఫానులను ధీటుగా ఎదుర్కొన్నారు. ప్రజల మధ్యకు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొనేవారు. యథాస్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేసేవారు. అయితే గత అనుభవాల దృష్ట్యా.. భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో చంద్రబాబు ముందస్తుగానే రంగంలోకి దిగారు. ఏపీ ప్రజలను రక్షించేందుకు కృషి చేస్తున్నారు. అయితే దీనిపై వైసీపీ ప్రచార యావ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది.
అపార అనుభవం..
చంద్రబాబు( AP CM Chandrababu) ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. పైగా సీనియర్ మోస్ట్ లీడర్. ప్రధాని నరేంద్ర మోడీ లాంటి నేత సైతం గౌరవంగా చూసుకుంటున్నారు. చంద్రబాబును వ్యక్తిగతంగా, రాజకీయపరంగానే వ్యతిరేకించారు కానీ.. చంద్రబాబు పనిని తప్పు పట్టిన సందర్భాలు లేవు. అంతెందుకు చంద్రబాబు పార్టీకి ప్రత్యర్థిగా ఉండే కాంగ్రెస్ పాలకులు, నేతలు సైతం ఆయన పనితీరును అభినందిస్తుంటారు. మొన్నటికి మొన్న ఏపీకి గూగుల్ డేటా సెంటర్ వచ్చే క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ పార్టీల నేతలు ఎంతగానో అభినందించారు. చంద్రబాబు శక్తియుక్తులను పరోక్ష సమావేశాల్లో గుర్తు చేసుకున్న వారు ఉంటారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం గుడ్డిగా చంద్రబాబు చేసే ప్రతి పనిని విమర్శించడం చేస్తోంది. ఇది ఎంత మాత్రం సహేతుకం కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సీఎంగా ఆయన ప్రధాన విధి..
తుఫాను సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ముఖ్యమంత్రిగా ఆయన విధి. ఆయన అప్రమత్తంగా ఉంటేనే మీడియా సైతం బాధ్యత వహించి ప్రచారం చేస్తుంది. ముందస్తు చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవకాశం ఉంది. చంద్రబాబు ఇష్టం లేకుంటే ఆయన చేసే పనులను కూడా పట్టించుకోకపోతే సరిపోతుంది. అంతేకానీ ఆయన పని చేయడం తప్పు అన్నట్టు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. అమ్మ పెట్టను పెట్టదు.. తిననివ్వదు అన్నట్టు ఉంది వైసీపీ వ్యవహార శైలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో సైతం చాలా రకాల విపత్తులు వచ్చాయి. కానీ ఆయన ఎన్నడూ తాడేపల్లి ప్యాలెస్ దాటి రాలేదు. ఒక సమీక్ష చేసినట్లుగా రెండు ఫోటోలు, పత్రికా ప్రకటనలు విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు అలా కాదు. చంద్రబాబు తన అనుభవాన్ని రంగరించి విపత్తుని ఎదుర్కోగలరు. ఆయన సమర్థతను తట్టుకోలేదు వైసిపి. కనీసం ఆయన పని ఆయన చేసుకోనిస్తే సరిపోయేది. కానీ అలా ఉండే పార్టీ కాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.