Telangana Pensioners: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత, కాంగ్రెస్ హామీలపై నమ్మకంతో ప్రజలు హస్తం పార్టీకి పట్టం కట్టారు. దీంతో పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్‌రెడ్డి సారథ్యంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అధికారం చేపట్టిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేశారు. తర్వాత రూ.500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేశారు. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేశారు. అయితే పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం, ఇందిరమ్మ ఇళ్లతోపాటు అనేక హామీలు అమలు కాలేదు. ఈ నేపథ్యంలో ఏడాది పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. ఇలాంటి తరుణంలో మరో హామీ నెరవేర్చేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ తరహాలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లు పెంచాలని భావిస్తోంది. పొరుగు రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి నెల నుంచే పింఛన్లు పెంచింది. తెలంగాణలో ఏడాది అయినా అములు కాలేదు. దీంతో వచ్చే ఏడాది జరిగే పంచాయతీ ఎన్నికల్లో నష్టం తప్పదని భావించిన సీఎం రేవంత్‌రెడ్డి.. పింఛన్ పెంపు మామీ అమలుకు కసరత్తు చేస్తున్నారు.
త్వరలో శుభవార్త..
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పింఛన్‌దారులకు త్వరలో శుభవార్త చెప్పబోతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పథకాల్లో ఆసరా పింఛన్లు కూడా ఒకటి. ప్రనస్తుతం వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు నెలకు రూ.2 వేలు ఇస్తున్నారు. దివ్యాంగులకు రూ.4 వేలు ఇస్తున్నారు. త్వరలోనే మరో రూ.2 వేలు కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 వేలు పెంచి ఇస్తామన్న రేవంత్‌రెడ్డి.. దానిని అమలు చేయకపోవడంతో అసంతృప్తి ఉంది. ఇటీవల చేపట్టిన సర్వే సందర్భంగా ఈ విషయాలు ప్రనభుత్వం దృష్టికి వచ్చాయి.
త్వరలో పంచాయతీ ఎన్నికలు..
మరోవైపు జనవరి లేదా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సర్వే పూర్తయిన వెంటనే దాని ప్రకారం రిజర్వేషన్లు సవరించి ఎన్నికలు జరపాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో పింఛన్లు, రుణమాఫీ, రైతుభరోసా వంటి పథకాలపై గ్రామీణులు అసంతృప్తితో ఉన్నారు. ఈతరుణంలో ఎన్నికలకు వెళ్తే నష్టం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే పింఛన్ల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. పథకం అమలుపై త్వరలోనే కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రైతు భరోసా కూడా ఇచ్చే అవకాశం ఉంది.
డిసెంబర్ 9న ప్రకటన..
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పుట్టిన రోజు అయిన డిసెంబర్ 9 నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సామావేశాల్లో చర్చించి పింఛన్ల పెంపుతోపాటు, రైతు భరోసాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతుభరోసాపై ఇప్పటికే భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అసెంబ్లీలో దీనిపై చర్చించి అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుని అమలు చేసే అవకాశం ఉంది. పింఛన్ పెంపుపైనా అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.