Kamma Mahasabha: తెలుగు రాజకీయాల్లో కీలక పరిణామం.. ఒకే వేదికపైకి ఏపీ, తెలంగాణ సీఎంలు..

రాష్ట్ర విభజన అనంతరం 2014లో తొలి రెండు రాస్ట్రాల ముఖ్యమంత్రులు మధ్య సఖ్యత వాతావరణ ఉన్నా.. అది కొద్ది రోజులే కొనసాగింది. తర్వాత నాటి తెలంగాణ సీఎం కేసీఆర్, నాటి ఏపీ సీఎం చంద్రబాబు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

Written By: Raj Shekar, Updated On : June 29, 2024 9:20 am

Kamma Mahasabha

Follow us on

Kamma Mahasabha: తెలుగు రాజకీయాల్లో త్వరలో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన గురువు, ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకుడు త్వరలో ఒకే వేదికను పంచుకోబోతున్నారు. హైదరాబాద్‌ వేదికగా జూలై 21, 22 తేదీల్లో నిర్వహించబోయే తొలి ప్రపంచ కమ్మ మహాసభకు ఈ ఇద్దరు ముఖ్య మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈమేరకు కమ్మ మహాసభ వ్యవస్థాపకుడు జెట్టి కుసుమకుమార్‌ వెల్లడించారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించే ఈ వేడుకలకు రేవంత్‌ రెడ్డి, చంద్రబాబుతోపాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. భారత దేశంలో 1.5 శాతం, ప్రపంచంలో 2.1 కోట్ల మంది కమ్మ సామాజికవర్గీయులు ఉన్నారని, వారందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు కుసుమకుమార్‌ తెలిపారు.

ఇప్పటి వరకు ఎదురు పడని గురు శిష్యులు..
ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు గడిచింది. ఇక ఏపీ సీఎంగా చంద్రబాబు నాయకుడు రెండోసారి ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు ఇద్దరు నేతలు ఎదురు పడలేదు. తెలంగాణ సీఎంగా రేవంత్‌ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా నాడు ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఎక్స్‌ వేదికగా రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఇటీవలి ఏపీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. దీంతో రేవంత్‌రెడ్డి తన రాజకీయ గురువు అయిన చంద్రబాబునాయుడికి ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు ఇద్దరు నేతలు ఎదురు పడలేదు. జూన్‌ 12న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్‌ హాజరవుతారని ప్రచారం జరిగింది. కానీ, చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించలేదు. ఈ నేపథ్యంలో కమ్మ మహాసభలకు ఇద్దరు సీఎంలు హాజరు కానుండడం, ఒకే వేదికను పంచుకోనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సానుకూల వాతావరణం:
రాష్ట్ర విభజన అనంతరం 2014లో తొలి రెండు రాస్ట్రాల ముఖ్యమంత్రులు మధ్య సఖ్యత వాతావరణ ఉన్నా.. అది కొద్ది రోజులే కొనసాగింది. తర్వాత నాటి తెలంగాణ సీఎం కేసీఆర్, నాటి ఏపీ సీఎం చంద్రబాబు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ఇద్దరు సీఎంల మధ్య వ్యవహారం ఉప్పు, నిప్పులా మారింది. ఈ క్రమంలో 2018లో కేసీఆర్‌ మరోమారు సీఎం అయ్యారు. 2019లో ఏపీ ఎన్నికల్లో జగన్‌ సారథ్యంలోని వైసీపీ 151 ఎమ్మెల్యే సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో కేసీఆర్, జగన్‌ మధ్య స్నేహ సంబంధం కొనసాగింది. ముఖ్యమంత్రి హోదాలో ఇరువురు పరస్పరం భేటీ అయ్యారు. అయితే ఇటీవల ఈ ఇద్దరు నేతలు అధికారానికి దూరమయ్యారు. తాజాగా ఇద్దరు నేతలు ఆరు నెలల వ్యత్యాసంతో మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఈ నేఫ్యథ్యంలో విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఈ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సానుకూలంగా చర్చలు జరుపుతారని తెలుస్తోంది.