America: అమెరికాలో స్కాలర్‌షిప్ కోసం తండ్రి చనిపోయాడని నాటకం ఆడడమే కాకుండా ఏకంగా డెత్ సర్టిఫికెట్ సృష్టించాడో యువకుడు. ఈ విషయం బయట పడడంతో మోసం చేసిన విద్యార్థిపై బహిష్కరణ వేటు వేశారు. త్వరలోనే స్వదేశానికి పంపించనున్నారు.
ఏం జరిగిందంటే..
భారత్‌కు చెందిన ఆర్యన్ ఆనంద్.. 2023 ఆగస్టులో పెన్సిల్వేనియాలోని యూనివర్సిటీ ఆఫ్ లేహీలో అడ్మిషన్ పొందాడు. ఈ సమయంలో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించాడు. పదో తరగతి పరీక్ష ఫలితాలను ఫోర్జరీ చేసిన అతడు.. పూర్తి స్కాలర్‌షిప్ కోసం అక్రమ మార్గాలను ఆశ్రయించాడు. తండ్రి బతికే ఉన్నప్పటికీ.. ఆయన చనిపోయినట్లు తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం సృష్టించాడు.ఈ ఫేక్ సర్టిఫికెట్లతోనే ఏడాది గడిపాడు.
అసత్యాలపైనే జీవిత నిర్మాణం..
ఈ క్రమంలో ఆర్యన్ ‘అసత్యాలపైనే తన జీవితం నిర్మించుకున్నాను’ అని సోషల్ మీడియాలో తన గురించి ప్రగల్భాలు పలుకుతూ ఓ పోస్టు పెట్టాడు. పదో తరగతి బోర్డు ఫలితాలు తారుమారు చేసిన తీరు, తప్పుడు ధ్రువపత్రాలతో అమెరికా కాలేజీలో చేరిన తీరును పేర్కొన్నాడు. అనంతరం చదువుపై ఆసక్తి కోల్పోవడం, స్కాలర్షిప్ కోసం పరీక్షల్లో మోసాలకు పాల్పడటం, తప్పుడు ఇంటర్న్‌షిప్ గురించి వివరించాడు.
అధికారుల దృష్టికి..
ఈ విషయం ఇటీవలే అక్కడి అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో జూన్ 12న ఆర్యన్ ఆనంద్‌ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దాదాపు 20 ఏళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉంది. అయితే, యూనివర్సిటీ అధికారుల అభ్యర్ధన మేరకు అతడిపై బహిష్కరణ వేటు వేశారు. దీంతో త్వరలోనే అతడిని భారత్‌కు పంపించాలని నిర్ణయించారు. త్వరలోనే అతను ఇండియాకు తిరిగి రానున్నాడు.