Gruha Jyothi Scheme: తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేద కుటుంబాలకు గృహ్యజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంది. దీంతో చాలా మంది జీరో కరెంటు బిల్లు వస్తోంది. అయితే వేసవిలో కొందరు కూలర్లు, ఏసీలు వాడడంతో 200 యూనిట్లు దాటి బిల్లు చెల్లిస్తున్నారు. వర్షాకాలం రాగానే మళ్లీ జీరో బిల్లుతో లబ్ది పొందుతున్నారు. అయితే ఈ సారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవడం లేదు. దీంతో రైతులు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. తాజాగా దీని ప్రభావం గృహజ్యోతి లబ్ధిదారులపైనా పడింది. వాతావరణ వ్యత్యాసాలతో గృహజ్యోతి లబ్ధిదారులు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో కూడా అసాధారణ ఎండలు, ఉక్కపోత కారణంగా గృహ విద్యుత్ వినియోగం పెరగడంతో అనేక మంది లబ్ధిదారులు అర్హత కోల్పోతున్నారు.
జూన్ నెలలో ఇలా..
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్)పరిధిలోనే సుమారు నాలుగు లక్షల మంది లబ్ధిదారులు పథకంతో లబ్ధి పొందలేకపోయారు. మొత్తం 26.54 లక్షల మంది నమోదైన వారిలో కేవలం 22.59 లక్షల మందికి మాత్రమే జీరో బిల్లు వచ్చింది. ఇతర విద్యుత్ సర్కిళ్లలో కూడా అనర్హుల సంఖ్య భారీగా ఉందని సమాచారం.
వాతావరణ మార్పులతో..
సాధారణంగా వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గి, విద్యుత్ వినియోగం తగ్గుతుందని అంచనా. కానీ ఎల్‌నినో ప్రభావంతో ఈ సమతుల్యత దెబ్బతింటోంది. అధిక ఎండలు, ఉక్కపోత కారణంగా ఫ్యాన్లు, ఏసీలు ఎక్కువగా వాడటం వల్ల చాలా గహాల్లో విద్యుత్ వినియోగం 200 యూనిట్ల పరిమితిని అధిగమించింది. ఇది పథకం రూపొందించిన సమయంలో ఊహించని వాతావరణ పరిస్థితుల వల్ల ఏర్పడిన సవాలు.
లబ్ధిదారులపై ప్రభావం..
పథకం నుంచి బయటకు వచ్చిన వారికి నెలవారీ విద్యుత్ బిల్లులు వస్తాయి. తక్కువ ఆదాయ కుటుంబాలకు ఇది అదనపు ఆర్థిక భారం. జూన్ నెలలోనే లక్షలాది మంది ఈ షాక్‌ను ఎదుర్కొన్నారు. జూలై నెలలో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనాలు. దీంతో పథకం యొక్క ప్రయోజనం తగ్గిపోతూ, లబ్ధిదారుల విశ్వాసం కూడా ప్రభావితం అవుతుంది.
మిగతా పథకాలపైనా..
ఈ పరిణామం కేవలం ఒక పథకానికి మాత్రమే పరిమితం కాదు. వాతావరణ మార్పులు ఇతర సంక్షేమ కార్యక్రమాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈఏపథ్యంలో గృహాల్లో విద్యుత్ సామర్థ్యం గల ఉపకరణాల వాడకం, అనవసర వినియోగం తగ్గించడం వంటి అలవాట్లు ప్రోత్సహించాలి. ఇళ్లలో ఇన్సులేషన్, ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్లు వంటి చర్యలు తీసుకోవాలి. వాతావరణ పరిస్థితులను బట్టి పరిమితులను సర్దుబాటు చేయడం లేదా అదనపు మద్దతు ఇవ్వడం గురించి ఆలోచించాలి.
మొత్తంమీద, ఎల్‌నినో సంక్షేమ పథకాలను ప్రభావితం చేస్తోంది. ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు, ప్రజలు కలిసి ఈ సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా మాత్రమే లబ్ధిదారులకు ఉపశమనం కలుగుతుంది.
