KTR Political Moves: రాజకీయ చదరంగంలో పావులు కదపడంలో కేసీఆర్ కు కేటీఆర్ కు చాలా వ్యత్యాసం ఉంది. కేసీఆర్ బహిరంగంగా ఒక ప్రకటన చేయడమో, లేక ఒక వ్యక్తిపై వ్యాఖ్యానించడానికి ముందు పరిపరివిధాల ఆలోచించి, పర్యవసనాలు ముందే పసిగట్టి మాట్లాడుతారు. అందుకే ఆయనకు మాటల మాంత్రికుడు, అపర చాణక్యుడిగా పార్టీ వర్గాలు కొనియాడుతాయి. ఆయన తీసుకునే నిర్ణయాలు పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లేందుకు పునాదిగా మారాయి.
Also Read: కేటీఆర్ ను అసలు కేసీఆర్ నమ్మలేదా?
పార్టీని ఇబ్బందుల్లో నెట్టిన కేటీఆర్ వ్యాఖ్యలు
కానీ కేటీఆర్ ముందూ వెనుక చూడకుండా మాట్లాడడంతో పార్టీని ఇబ్బందుల్లో నెట్టుతున్నట్లు ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. పార్టీ పగ్గాలు దాదాపుగా కేసీఆర్ తన తనయునికి అప్పగించి పార్టీని నడిపించే తీరును మౌనంగా ఫాంహౌస్ నుంచి సునిశితంగా పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే కేటీఆర్ అనవసరమైన విషయాలను నెత్తిన వేసుకొని వాటిపై స్పందించడం,
నోరుజారి నాలుక కర్చుకోవడం ఆయనకు పరిపాటిగా మారింది. ఇలా ఎన్నోసార్లు జరిగినా ఆ సమయం మంచిది కాబట్టి నడిచిపోయింది. కానీ కష్టకాలంలో ఇలాంటి వ్యాఖ్యలు పార్టీని మరింత బలహీనపరుస్తాయనే విషయం కేసీఆర్ కు తెలిసినంతగా కేటీఆర్ కు తెలియది అనుకునే ప్రమాదం ఉంది.
అతిగా మాట్లాడడం అలవాటే
అనవసరంగా సీఎం రమేశ్ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీవర్గాల్లో అనుమానాలకు తావిచ్చినట్లు అయ్యింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యలు ఆయన్ను ఇరకాటంలో పెట్టేందుకు చేసినా, ఈ వ్యవహారంలో ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ సాయం తీసుకున్నారని, అందుకు బదులుగా ఫోర్త్ సిటీలో రూ.1600 కోట్ల విలువైన పనులను రేవంత్ రెడ్డి అప్పగించారని ఆరోపించడం పెద్ద దుమారానికి దారితీసింది. దీనిపై సీఎం రమేశ్ ప్రతిస్పందించడంతో మరో మలుపు తిరిగింది.
లిక్కర్ కేసులో కవిత అరెస్టు ఆయన తరువాత ఆమెను జైలు నుంచి విడిపించేందుకు మధ్యవర్తిత్వం చేయాలని కేటీఆర్ తన వద్దకు వచ్చి అభ్యర్థించినట్లు ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. అలాగే అందుకు ప్రతిగా పార్టీని బీజేపీ లో విలీనం చేసేందుకు సైతం సిద్ధమని కేటీఆర్ అన్నట్లుగా ఆయన బాంబు వేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఇరకాటంలో పడింది.
లైన్లోకి బీజేపీ నాయకత్వం
ఇదే అదనుగా కేటీఆర్ అంటేనే ఒంటికాలు మీద లేసి విమర్శించే బీజేపీ కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ సంజయ్ కూడా జోక్యం చేసుకొన్నారు. కేటీఆర్ ఆ మాటలు అన్నట్లుగా రుజువు చేస్తామని బస్తిమే సవాల్ అంటూ కరీంనగర్ లో మీడియాలో మాట్లాడడంతో బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఖిన్నులవుతున్నారు. పార్టీ ఎటుపోతున్నదో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
Also Read: అక్కడే ఎందుకు… హైదరాబాద్ లో మరో కేబుల్ బ్రిడ్జి.. విశేషాలివీ..
బిఆర్ఎస్ విలీనానికి సిద్ధమైందా.?
నిజంగానే బిఆర్ఎస్ కవిత కోసం పార్టీ విలీనానికి సిద్ధమైందా అనే విషయంపై వాడివేడిగా చర్చ ఊపందుకుంది.
టీఆర్ఎస్, బిఆర్ఎస్ రూపాంతరం చెందిన తరువాత ఆ పార్టీకి కష్టాలు మొదలయ్యాయనీ పెద్దాయన ఉన్నప్పుడే పార్టీ ఒక పద్దతి ప్రకారం ఉండేదని ఇప్పుడు పరిస్తితి మరోలా ఉందని కొంతమంది నాయకులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అందుకే
రాజకీయాల్లో ఆచితూచి మాట్లాడుకుంటే ఎదురుదెబ్బలు తప్పవు, నోరు జారితే తనకు మాత్రమే కాదు, తన్ను నమ్ముకొని పార్టీలో ఉన్న వారికి కూడా మరిన్ని కష్టాలు తెచ్చిపెడతాయనే విషయం గుర్తెరిగి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితేనే పరువుపోకుండా ఉంటదనేది నిత్య సత్యం.