India Pakistan Cricket Controversy: త్వరలో ఆసియా కప్ జరగనుంది. యూఏఈ వేదికగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. టి20 విధానంలో ఈ టోర్నీ నిర్వహిస్తామని ఇప్పటికే నిర్వాహకులు వెల్లడించారు. ఆసియాలో క్రికెట్ ఆడే ప్రధాన జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.. ఈ టోర్నీలో ఆడే జట్లను రెండు విభాగాలుగా విభజించారు. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ గ్రూపు- ఏ లో ఉన్నాయి.. ఈ రెండు జట్లు సెప్టెంబర్ 14న తలపడతాయి.
Also Read: జడేజాతో ఇంగ్లండ్ ఆటగాళ్ల గొడవ.. అసలు ఆ వీడియోలో ఏం జరిగిందంటే?
భారత్, పాకిస్తాన్ చిరకాల ప్రత్యర్థులు కావడంతో మ్యాచ్ జరిగే ప్రతి సందర్భంలోనూ ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంటుంది. పైగా ఈ మ్యాచ్ ద్వారా వేలకోట్ల వ్యాపారం జరుగుతుంది. అందువల్లే ప్రతి మెగా టోర్నీ లోనూ ఈ రెండు జట్లు తలపడే విధంగా ఒక మ్యాచ్ రూపొందిస్తారు. గతంలో అయితే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు గాని.. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ జట్టుతో భారత్ మ్యాచ్ ఆడటాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. మనదేశంలోకి ప్రవేశించి 26 మందిని ఉగ్రవాదులు చంపారని.. వారంతా కూడా పాకిస్తాన్ ప్రేరేపిత వ్యక్తులని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాంటి దేశంతో క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడతారని? ఇటీవల లెజెండ్స్ క్రికెట్ టోర్నీ జరిగినప్పుడు.. పాకిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్ ను రద్దు చేసుకున్నారని.. ఆసియా కప్ విషయానికి వచ్చేసరికి ఏమైందని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.
పహల్గామ్ దాడి జరిగిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ ఆడేది లేదని స్పష్టం చేసింది. పాకిస్తాన్ గడ్డపై జరిగే టోర్నీ లోనూ ఆడేది లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ తలపడే విధంగా షెడ్యూల్ మార్చడం విశేషం. ఎప్పుడైతే ఆసియా కప్ షెడ్యూల్ విడుదలైందో.. అప్పటినుంచి ప్రతిపక్షాలు ప్రభుత్వం తీరును ఎండగడుతున్నాయి. దేశ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నమని చెప్పి.. ఇలా చేయడం ఏంటని ఆరోపిస్తున్నాయి.
Also Read: ఆసియా కప్.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా?
” ఉగ్రవాదులతో శాంతి ఏంటని అంటారు. ఉగ్రవాదు దేశంతో చర్చలు ఏంటని ప్రశ్నిస్తారు. కానీ వారేమో ఉగ్రవాద దేశంతో క్రికెట్ ఆడుతుంటే చూస్తుంటారు. క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణకు షెడ్యూల్ రూపకల్పన చేస్తే నిశ్శబ్దంగా ఉంటారు. పైకేమో దేశ రక్షణ అంటూ కబుర్లు చెబుతుంటారు. ఇదంతా ఏంటి.. ఇలా జరుగుతుంటే నిశ్శబ్దంగా చూస్తూ ఉంటారేంటి.. భారత క్రికెట్ నియంత్రణ మండలిపై చర్యలు తీసుకోరా.. దేశ అంతర్గత భద్రత కూడా సులువైన విషయం లాగా మీకు కనిపిస్తోందా.. ఇటువంటి విధానాలు సరికాదు.. ఇప్పటికైనా ఈ విషయంపై ఒక చొరవ తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని” ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి బాధ్యులు నిశ్శబ్దంగా ఉండడం విశేషం.