Hyderabad New Cable Bridge Details: అభివృద్ధిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నగరం హైదరాబాద్. అనేక మందికి ఉపాధి కేంద్రంగా మారింది. దేశ విదేశాల నుంచి ప్రజలు, ఉద్యోగులు, కూలీలు ఉపాధి నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు. పర్యాటకంగా కూడా నగరానికి గుర్తింపు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తోంది. మరోవైపు కేంద్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరిస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సిగలోకి మరో నగ అలంకరించబోతోంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి విజయం తర్వాత, మీర్ ఆలం చెరువుపై రెండో కేబుల్–స్టేడ్ బ్రిడ్జి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ వంతెన నగర రవాణా సౌలభ్యాన్ని మెరుగుపరచడమే కాక, ఆర్థిక, పర్యాటక రంగాలకు కొత్త ఊపును తీసుకొస్తుందని భావిస్తున్నారు.
Also Read: బీజేపీ గుట్టు బయటపెడుతోన్న రాజాసింగ్
మీర్ ఆలంపైనే ఎందుకు?
కొత్త కేబుల్–స్టేడ్ బ్రిడ్జి హైదరాబాద్‌లోని మీర్ ఆలం చెరువుపై నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడే ఎందుకు అంటే.. ఇది చింతల్‌మెట్ రోడ్‌ను బెంగళూరు నేషనల్ హైవేతో అనుసంధానిస్తుంది. ఈ వంతెన ఓల్డ్ సిటీలోని బహదూర్‌పురా ప్రాంతంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడానికి రూపొందించబడింది. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటోంది. అంచనా వ్యయం సుమారు రూ.363 కోట్లుగా ఉండగా, వంతెన మొత్తం పొడవు 2.65 కిలోమీటర్లు, ఇందులో ప్రధాన వంతెన, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంప్‌లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు హైదరాబాద్‌ను సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా ఒక కీలక దశ.
Also Read: బీజేపీలో విలీనం.. కేటీఆర్ సంచలన ప్రకటన
వంతెన ప్రత్యేకతలు..
మీర్ ఆలం చెరువు కేబుల్ బ్రిడ్జి నాలుగు లేన్‌ల హై–లెవల్ వంతెనగా రూపొందించబడుతుంది, ఇది రవాణా సౌలభ్యంతోపాటు చూడడానికి ఆకర్షణగా కూడా ఉంటుంది. ఈ వంతెన డిజైన్‌లో దుర్గం చెరువు వంతెన లాంటి ఎక్స్‌ట్రాడోస్డ్ కేబుల్–స్టేడ్ సాంకేతికతను అనుసరించే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో రంగురంగుల లైటింగ్, ఆధునిక డిజైన్‌తో ఈ వంతెన నగరంలోని పర్యాటక ఆకర్షణలకు మరో మణిహారంగా మారనుంది. నాలుగు లేన్‌ల డిజైన్ రద్దీని తగ్గించి, సమర్థవంతమైన రవాణాను సాధ్యం చేస్తుంది. తక్కువ పిల్లర్లతో నిర్మాణం జరిగేలా రూపొందించబడి, చెరువు పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గిస్తుంది. వంతెన చుట్టూ వినోద కేంద్రాలు, వాణిజ్య కార్యకలాపాల అభివృద్ధికి ఊతం ఇస్తుంది. స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ ప్రాజెక్టును స్వాగతిస్తూ, ఇది స్థానికులకు వినోద, ఆర్థిక అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు.