Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తాజా తీర్పు, తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టించింది. ఒకవైపు కోర్టు ఈ కేసును కొట్టివేస్తూ, సరైన సాక్ష్యాధారాలు లేవని, ఆరోపణలన్నీ ఊహాజనితమని తేల్చిచెప్పడం బీఆర్ఎస్ నేతలకు పెద్ద ఊరటనిచ్చినప్పటికీ… సీబీఐ వెంటనే హైకోర్టును ఆశ్రయించడం ఈ వ్యవహారంలో ఉత్కంఠను కొనసాగిస్తోంది. అంటే, చట్టపరంగా ఇదొక మలుపు మాత్రమేనని, అసలు కథ ఇంకా ముగియలేదని స్పష్టమవుతోంది.
Also Read: అల్లు అరవింద్ ని ఆ రోల్ కోసం బ్రతిమిలాడాను… కానీ ఇవ్వలేదు – హీరో రాజశేఖర్
సాక్ష్యాలు లేని ‘సీబీఐ’ కథ!
జడ్జి జితేంద్ర సింగ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే, సిబిఐ చేసిన దర్యాప్తు సరైన దిశలో లేదని, ప్రైమా ఫేసీ కేసు కూడా నిలబడలేదని అర్థమవుతోంది. ‘డబ్బు ట్రైల్’ ఎక్కడా కనిపించలేదన్న కోర్టు వ్యాఖ్యలు, దర్యాప్తు సంస్థల విశ్వసనీయతను మరోసారి ప్రశ్నార్థకం చేశాయి. కేసు తేలిపోయిందనే సంకేతాలు వెలువడగానే, సిబిఐ ఆఘమేఘాల మీద హైకోర్టుకు పరుగెత్తడం చూస్తుంటే… ఇది సాంకేతిక అంశం కంటే రాజకీయ కోణంలోనే ఎక్కువగా నడుస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి.
రాజకీయ రణరంగంలో ‘ఫ్యామిలీ ఫైట్’
ఈ కేసు కోర్టులో కంటే రాజకీయ వేదికపైనే పెద్ద బ్లాక్‌బస్టర్‌గా మారింది. ఒకప్పుడు పార్టీకి ప్రధాన బలంగా ఉన్న కవిత, ఇప్పుడు అదే పార్టీకి విమర్శకురాలిగా మారడం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన ట్విస్ట్. పార్టీ ఓటమికి తానొక్కర్తే కారణం కాదని, పాలనలో లోపాలే కొంపముంచాయని కవిత కేటీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు… బీఆర్ఎస్లో అంతర్గత పోరును రచ్చకెక్కించాయి. అరెస్ట్ సమయంలో సైలెంట్ స్ట్రాటజీని నమ్ముకున్న పార్టీకి, ఇప్పుడు బయటకు వచ్చాక కవిత చేస్తున్న విమర్శలు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి.
తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి?
కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్‌తో కవితకు కొత్త ఉత్సాహం లభించింది. ఈ పరిణామాలను ఆమె తన రాజకీయ పునరాగమనానికి, బీఆర్ఎస్ పైన, బీజేపీ పైన ఒత్తిడి పెంచడానికి ఎలా వాడుకుంటారన్నది కీలకం. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందా? లేక సొంత నిర్ణయాలతో కొత్త సమీకరణాలకు తెరలేపుతారా? అన్నది వేచి చూడాలి.
ఏది ఏమైనా ఢిల్లీ మద్యం కేసు ఫుల్ క్లైమాక్స్ కాదు, ఇదొక ఇంటర్వెల్ మాత్రమే. సీబీఐ అప్పీల్ ఫలితంపైనే ఈ డ్రామా తదుపరి సీక్వెల్ ఆధారపడి ఉంది. కేసులో క్లీన్ చిట్ దక్కినా, రాజకీయ మత్తులో తెలంగాణ ఇంకా తేరుకోలేదనేది మాత్రం వాస్తవం.