Kaleshwaram Project
Kaleshwaram Project: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి పర్యవేక్షణలో రెండు అడుగులు కుంగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును మళ్లీ కట్టాలని అంటున్న ఈ తరుణంలో తెలంగాణలో వ్యవసాయ రంగానికి, తాగునీటికి ఇబ్బందికరంగా మారే పరిస్థితులు వచ్చే అవకాశముందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ శాశనసభలో ప్రకటన చేయడం చర్చకు దారితీసింది.
Also Read: బైరెడ్డి కుటుంబంలో పోరు.. తమ్ముడికి తలంటిన అక్క!
అంటే కాళేశ్వరం గొప్పతనాన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్లేననే ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెరలేపారు. అయితే ఆ ప్రకటన ఏ సందర్భంలో చేశారు. ఎందుకు ఒక ఎమ్మెల్యే ద్వారా రాష్ర్ట ప్రభుత్వం చేయించిందనే విషయమై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ప్రధాన బ్యారేజీ మూడు గేట్లు కుంగిపోవడంతో ప్రమాదకరమని భావించి, గద్దెనెక్కిన కొన్ని రోజుల వ్యవధిలోనే బ్యారేజీలో ఉన్న నిలువనీటిని పూర్తిగా విడిచిపెట్టారు. ఇది తొందరపాటు చర్య అని బీఆర్ఎస్ తీవ్రంగా ప్రభుత్వంపై విరుచుకుపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో కుట్ర పూరితంగా వ్యవహరించిందని, మూడు గేట్లు కుంగిపోవడం వల్ల జరిగే నష్టం ఏమిలేదని, వాటిని మరమ్మతు చేస్తే సరిపోతుందని బీఆర్ఎస్ నాయకులు నెత్తినోరు మొత్తుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పిలువబడే ఈ ప్రాజెక్టు ఇలాగే కొనసాగితే అపర భగీరథుడని కేసీఆర్ పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందని, లేనిపోని ఆరోపణలు చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు జరిగాయని రాష్ర్ట ప్రభుత్వం చేస్తున్న ప్రచారమని ఆరోపించారు. అయితే ఒకవైపు ఈ విషయమై ట్రిబ్యునల్ ప్రాజెక్టు నిర్మాణంలో బాధ్యులైన వారందరినీ ప్రశ్నించే ప్రక్రియ నడుస్తుండగా, మరోవైపు ఈ ప్రాజెక్టు గేట్ల మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేసి నీటి నిలువ చేయకుంటే సాగు, తాగు నీటి సమస్యలు తలత్తే అవకాశాలు ఉన్నాయని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.
అప్పుడేం పరిస్థితి.. ఇప్పుడెలా.?
ప్రాజెక్టు ఎత్తిపోతల మూలంగా గోదావరి ఎగువ ప్రాంతంలో నీటి సమస్య లేకుండా జలకళ ఉట్టిపడింది. అలాగే భూగర్భ జలాలు పెరిగి సాగుకు సమస్య లేకుండా చేశాయి. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు చతికిల పడడంతో నీరు ఎతిపోసే అవకాశం లేకుండా పోవడంతో జలశయాల్లో నీటి మట్టం రోజురోజుకు తగ్గుముఖం పట్టడం వల్ల ఆందోళనకు కారణమవుతోంది. గత రబీ, ఖరీఫ్ సీజన్లలో నీటి సమస్య పెద్దగా కనిపించలేదు. ప్రస్తుత రబీకి పంట పొలాలకు నీరందించడమే కాకుండా తాగునీటికి కూడా సమస్యగా పరిణమించవచ్చని భావిస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ర్ట ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు పడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం వేసవి కాలంలో సమస్యలు తలత్తే అవకాశాలున్నాయని, అందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరించాలని ముందస్తు శాశనసభ వేదికగా ఒక ఎమ్మెల్యే ద్వారా దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేయడం వెనుక ఆంతర్యం బోధపడుతోంది. ఈ ప్రకటన ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుందనే ప్రచారానికి ఊతమిచ్చినట్లైంది. ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు లోపభూయిష్టమని, పనికిరాని ప్రాజెక్టు కట్టి ప్రజల నెత్తిన అప్పుల భారం మోపారని, ప్రాజెక్టు ఆగిపోయినా అనుకున్న స్థాయిలో సాగుతో పాటు ఎక్కువ దిగుబడి వచ్చిందని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు శాశనసభ సమావేశాల్లో ఒక ఎమ్మెల్యేతో ఇలాంటి ప్రకటన చేయించడానికి కారణాలేమై ఉంటాయని చర్చ మొదలయ్యింది. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మూలంగా సాగుబడి ఎక్కువైందా, తాగునీటి సమస్య పూర్తిగా లేకుండా పోయిందా అనే విషయం మళ్లీ చర్చకు దారితీసింది.
మరి నష్టపోయిందెవరూ..?
అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం, ఎత్తిపోతల ద్వారా ప్రధాన జలాశయాలను నీటితో నింపడమనే ప్రక్రియతో ఎక్కడ చూసినా జలకళ కనిపించిన మాట వాస్తవమే. కాని శ్రీపాదసాగర్(ఎల్లంపల్లి), శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు దిగువ కాళేశ్వరం ప్రాజెక్టు కింద భాగం వరకు కొత్తగా ఒక్క ఎకరానికి ఈ ప్రాజెక్టు మూలంగా నీరు అందలేదని ఆయా ప్రాంతాల రైతులు చెబుతున్నారు. ఎకబిగిన వరుసగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో తమ భూములకు నీరు అందించాలనే ఆలోచన పాలకులు చేయలేదని ఆరోపించారు. కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే కాలువల ద్వారా నీరందించారని, తమ ప్రాంతంలో కనీసం కాల్వల నిర్మాణం చేయలేదని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అద్భుతమే కాని తమకు మాత్రం ఈ ప్రాజెక్టు వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని వారు అభిప్రాయపడ్డారు.
Also Read: కొత్త వ్యాపారంలోకి దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి.. పాలిటిక్స్ కు గుడ్ బై!