Congress list : పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ మరో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులో నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధుకు టికెట్లు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే కరీంనగర్ స్థానానికి సంబంధించి అధిష్టానం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఖమ్మం విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇక నిజామాబాద్ లో బిజెపి అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి పేరు ఖరారు చేయడంతో అక్కడ పోటీ రసవత్తరంగా మారింది. జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యేగా పలు మార్లు ఎన్నికయ్యారు. నాదెండ్ల భాస్కరరావు ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. వాస్తవానికి జీవన్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని టిడిపి నుంచి ప్రారంభించినప్పటికీ.. 1985లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తర్వాత 1989 లో జరిగిన ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 ఎన్నికల్లో ఓడిపోయారు. 1996 ఉప ఎన్నికల్లో గెలిచారు. 1999, 2004 ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ ఘనత సొంతం చేసుకున్నారు.
2004 నుంచి 2009 వరకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2006, 2009లో (తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక ఎన్నికలు) కరీంనగర్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రికార్డ్ సృష్టించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. మరుసటి ఏడాది జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. 2023 ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి అవకాశం కల్పించడంతో.. ఆ స్థానంలో విజయం సాధించాలని ఆయన భావిస్తున్నారు. ఈసారి గెలిచి తన చిరకాల వాంఛను నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే జగిత్యాల నుంచి ఢిల్లీ వరకు రైల్వే లైన్ నిర్మిస్తానని ఇప్పటికే ఆయన హామీ ఇచ్చారు. మరి ఈసారైనా ఆయన గెలుస్తారా? పార్లమెంట్లో అడుగు పెడతారా? చూడాలి ఏం జరుగుతుందో..