https://oktelugu.com/

Elevated Corridors: ఉత్తర తెలంగాణకు రాచబాట.. రేవంత్ చేస్తోన్న ఈ పనికి అంతా ఫిదా

ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణంతో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది. సికింద్రాబాద్‌లో అత్యంత ఇబ్బందిగా మారిన ట్రాఫిక్‌ సమస్య తొలగిపోతుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 7, 2024 / 08:51 AM IST

    Elevated Corridors

    Follow us on

    Elevated Corridors: ఉత్తర తెలంగాణ ప్రజలు రాజధాని హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులు త్వరలోనే తొలగిపోనున్నాయి. ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి భూములు కేటాయించారు. దీంతో వెంటనే పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.2,232 కోట్లతో హైదరాబాద్‌ – రామగుండం రహదారిపై ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి గురువారం(మార్చి 7న) భూమిపూజ చేయనున్నారు. ఈమేరకు అల్వాల్‌లోని టిమ్స్‌ సమీపంలో ఏర్పాటు చేశారు.

    11.3 కి.మీ పొడవు.. ఆరులేన్లు..
    ఈ భారీ ఎలివేటెడ్‌ కారిడార్‌ను 11.3 కిలోమీటర్ల పొడవు నిర్మించనున్నారు. ఆరు లేన్లతో నిర్మాణం జరుగనుంది. ఎంట్రీ, ఎగ్జిట్‌ ర్యాంపులు నిర్మిస్తారు. దీంతో సికింద్రాబాద్‌లో వాహనదారుల కష్టాలు తీరనున్నాయి. కరీంనగర్‌వైపు నుంచి రాజధానికి రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది. హైదరాబాద్‌ – రామగుండం రాజీవ్‌ రహదారికి మహర్దశ వస్తుంది.

    రక్షణ భూముల అప్పగింతతో..
    కేంద్ర రక్షణశాఖ ఇటీవలే ఆ శాఖకు సంబంధించిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు అంగీకరించింది. జనవరి 5న సీఎం రేవంత్‌ రెడ్డి.. ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి డిఫెన్‌స భూముల మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అనుమతివ్వాలని లేఖను అందజేశారు. ఈమేరకు కేంద్రం భూములు కేటాయించింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు కారిడార్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా రాజీవ్‌రహదారిపై ప్యారడైజ్‌ నుంచి హకీంపేట్‌ వరకు సుమారు 11.3 కిలోమీటర్ల పొడవున కారిడార్‌ నిర్మాణానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు.

    83 ఎకరాలు బదిలీ..
    రాష్ట్రానికి 83 ఎకరాల భూమి అవసరమని రక్షణ శాఖ మంత్రికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నాగ్‌పూర్‌ హైవే (ఎన్ హెచ్‌ –44)పై కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామని తెలిపారు. అందులో 12.68 కిలోమీటర్ల ఆరులేన్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీలకు, భవిష్యత్తులో డబుల్‌ డెకర్‌ (మెట్రో కోసం) కారిడార్, ఇతర నిర్మాణాలకు మొత్తంగా 56 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయాలని కోరారు. రక్షణ శాఖ భూముల అప్పగింతతో ఉత్తర తెలంగాణ దిశగా రహదారుల విస్తరణకు మార్గం సుగమమైంది.

    ఆ మూడు ఉమ్మడి జిల్లాలకు..
    ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణంతో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది. సికింద్రాబాద్‌లో అత్యంత ఇబ్బందిగా మారిన ట్రాఫిక్‌ సమస్య తొలగిపోతుంది. ఈ కారిడార్‌ నిర్మాణంతో గ్రేటర్‌ సిటీ ఉత్తర దిశగా అభివృద్ధి చెందుతుంది.

    గత ప్రభుత్వం తీర్మానం..
    సికింద్రాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి కంటోన్‌మెంట్‌ పరిధిలోని రాజీవ్‌రహదారి, 44వ నంబర్‌ జాతీయ రహదారిలో స్కైవేలు నిర్మించాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు క్యాబినెట్‌లో తీర్మానం చేసింది. ఈమేరకు కేంద్ర రక్షణ శాఖకు తీర్మానం పంపింది. ఎట్టకేలకు రక్షణ శాఖ అనుమతులు ఇచ్చింది. గతంలో 33 ఎకరాలు ఇవ్వగా, తాజాగా 150 ఎకరాలు కేటాయించింది.