Homeటాప్ స్టోరీస్Thammineni Veerabhadram: తమ్మినేని పై అభిశంసన.. సిపిఎం ఆలస్యంగా మేల్కొంది

Thammineni Veerabhadram: తమ్మినేని పై అభిశంసన.. సిపిఎం ఆలస్యంగా మేల్కొంది

Thammineni Veerabhadram: చేతులు కాలిన తర్వాత.. బర్నాల్ రాసుకుంటే ఉపయోగం ఉండదు. చేతులు కాలకముందే జాగ్రత్త పడితే బర్నాల్ రాసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు సిపిఎం కేంద్ర కమిటీ చేసిన పని పై ఉపోద్ఘాతం మాదిరిగానే ఉంది. ఎందుకంటే ఆ పార్టీలో ఎవరు ఎవరిని నియంత్రిస్తున్నారు.. ఎవరు ఎవరికి జవాబుదారి అనేది ఇంతవరకు తెలియదు. తాజాగా కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తీరును తీవ్రంగా తప్పుపడుతూ సిపిఎం అధినాయకత్వం అభిశంసిస్తూ నిర్ణయం తీసుకుంది.

తమ్మినేని వీరభద్రం సాధారణ నాయకుడు కాదు. అతడికి తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన పరిచయాలు ఉన్నాయి. జాతీయస్థాయిలో కూడా కాకల తీరిన రాజకీయ నాయకుడు. అటువంటి నాయకుడు తీరును తప్పుపడుతూ సిపిఎం కేంద్ర కమిటీ అభి శంసించడం ఒకరకంగా సంచలనం. పైగా పార్టీ కేంద్ర కమిటీ.. రాష్ట్ర కమిటీకి లేఖ రాయడం.. ఆ లేఖ లీక్ కావడం సంచలనం కలిగిస్తోంది.

తమ్మినేని నాయకుడిగా ఉన్నప్పుడు తీవ్రమైన నిర్మాణ అనైక్యత చోటు చోటు చేసుకుందని.. ముఠా తత్వం ఏర్పడిందని.. ప్రమాణాల ఉల్లంఘన కొనసాగుతోందని.. అస్తిత్వవాద రాజకీయాల ప్రభావం నడుస్తుందని.. తప్పుడు రాజకీయ దృక్పథం.. ఫెడరల్ ధోరణులు.. పార్టీ విలువలు తగ్గిపోవడం ఇటువంటివి చోటు చేసుకుంటున్నట్టు అభిశంసన లేఖ లో కేంద్ర కమిటీ ప్రస్తావించినట్టు తెలుస్తోంది..

కేంద్ర కమిటీకి తమ్మినేని వీరభద్రం.. రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్న స్కైలాబ్ బాబు.. ప్రసాద్ ఇచ్చిన వివరణలు సరిగా లేవని పార్టీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే పేర్కొంది. అందులో కనీసమైన ఆత్మ విమర్శ కూడా లేదని స్పష్టం చేసింది. కేంద్ర కమిటీ నిర్మాణానికి తగిన విధంగా ప్రవర్తించడంలో విఫలమైన తమ్మినేని వీరభద్రం.. స్కైలాబ్ బాబు.. ప్రసాద్ పై కేంద్ర కమిటీ చర్యలు తీసుకుందని.. వారి ముగ్గురిని కూడా అభిశంసించిందని సమాచారం.

తమ్మినేని వీరభద్రాన్ని కేవలం రాష్ట్ర సెక్రటేరియట్.. కమిటీ సమావేశాలలో పరిశీలకుడిగా మాత్రమే నడుచుకోవాలని.. రాష్ట్ర సెక్రటేరియట్ నాయకత్వంలో పనిచేయాలని కేంద్ర కమిటీ సూచించినట్టు సమాచారం. ముగ్గురు కీలక నాయకులు తప్పులు చేసిన నేపథ్యంలో.. ఈ చర్యలు వారి నడవడికలో మార్పును తీసుకొస్తాయని ఆశిస్తున్నట్టు కేంద్ర కమిటీ ప్రకటించింది.

తమ్మినేని వీరభద్రం అభి శంసనకు గురైన నేపథ్యంలో.. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం విడుదలైన ఓ పుస్తకాన్ని కొంతమంది గుర్తు చేస్తున్నారు. నాడు సిపిఎం పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు నిప్పుకు చెదలు అనే పేరుతో ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. ఆ పుస్తకం ముందు పేజీ మీద సిపిఐ (ఎం) పేరుతో 60 పేజీల అసలు వ్యవహారాలను తెరపైకి తీసుకొచ్చారు. అప్పట్లో ఈ పుస్తకం సంచలనం కలిగించింది. చాలామంది నాయకుల త్యాగాలతో ఏర్పడిన పార్టీ.. ఇప్పుడు స్వార్థపరుల చేతుల్లోకి వెళ్లిందని.. మొత్తం బలిపీఠం ఎక్కిందని అందులో వాస్తవిక వాదులు పేర్కొన్నారు.

ఆ పుస్తకాన్ని అప్పటి సిపిఎం ఖమ్మం జిల్లా నాయకులు వనం నరసింహ రావు.. వై వినయ్ కుమార్.. రాయల వెంకటేశ్వర్లు.. కిలారు సీతారాములు.. ఎర్రబోయిన సీతారాములు.. నల్లపునేని అప్పారావు.. జొన్నలగడ్డ రవికుమార్.. ఇలవల పుల్లారెడ్డి.. ఎడవల్లి రాంరెడ్డి రచించారు. ఆ పుస్తకం వెలుగులోకి వచ్చిన తర్వాత రూపకర్తలందరూ బహిష్కరణకు గురయ్యారు. అయితే ఈ పుస్తకం వెనుక టీఎన్ ప్రసాద్, ధనాల కొండయ్య వంటి వ్యక్తులు కూడా ఉన్నట్టు ప్రచారంలో ఉంది. ఈ నాయకుల్లో టిఎన్ ప్రసాద్.. ఇంకా కొంతమంది వేరువేరు కారణాల వల్ల చనిపోయారు. మిగతా వారంతా వేరువేరు పార్టీలలో కొనసాగుతున్నారు.

నాడు విడుదల చేసిన నిప్పుకు చెదలు పుస్తకంలో బోడెపూడి వెంకటేశ్వరరావు, బాజీ హనుమంతు, ఎడవల్లి పద్మారెడ్డి, గట్లూరి కిషన్ రావు, బండారు చంద్రరావు, ఏలూరు లక్ష్మీనారాయణ, బోజడ్ల వెంకటనారాయణ, రావెళ్ళ సత్యనారాయణ, టీవీఆర్ చంద్ర, మంచి కంటి రామ్ కిషన్ రావు, శేషగిరిరావు, బోడెపూడి వెంకటేశ్వరరావు, చిర్రావూరి లక్ష్మీనారాయణ వంటి వ్యక్తులను ప్రముఖంగా ప్రస్తావించారు. వారు చేసిన త్యాగాల వల్ల పార్టీ ఏ స్థాయికి ఎదిగిందో గుర్తు చేశారు. తమ్మినేని నాయకుడిగా మారిన తర్వాత.. పార్టీ దిగజారిన తీరు.. ముదిగొండ కాల్పులు.. పాలేరు డివిజన్లో కుటుంబ సభ్యుల పెత్తనం వంటి వాటిని ఆ పుస్తకంలో ప్రముఖంగా ప్రస్తావించారు.

ఈ పుస్తకం తోనే ఆ నాయకులు ఆగిపోలేదు. నాడు ఉమ్మడి రాష్ట్రానికి కార్యదర్శిగా ఉన్న బీవీ రాఘవులకు.. జాతీయ కార్యదర్శి ప్రకాష్ కారత్ వంటి వారికి లేఖలు కూడా రాశారు. ఆ పుస్తకాలలో ఉన్న ప్రముఖమైన విషయాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు. ఇంత చేసినప్పటికీ బివి రాఘవులు లాంటి నాయకుడు తమ్మినేని వీరభద్రాన్ని బంగారం అని ప్రస్తావించారు. అయితే ఇన్నాళ్లకు పార్టీ కేంద్ర కమిటీ తమ్మినేని వీరభద్రాన్ని.. ఇంకా ఇద్దరు ముఖ్య నాయకులను అభి శంసించడం నిజంగా ఆశ్చర్యకరం.

తమ్మినేని రాజకీయ జీవితంలో ఇంకా కొన్ని కోణాలను ఇక్కడ కేంద్ర కమిటీ పక్కనపెట్టినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా తమ్మినేని పార్టీకి చేసిన సేవలను.. పురోగతికి శ్రమించిన తీరును కేంద్ర కమిటీ పట్టించుకోవడం తెలుస్తోంది. గోదావరి జలాలను పాలేరుకు అనుసంధానించాలని తమ్మినేని వీరభద్రం 20 సంవత్సరాల క్రితమే దుమ్ముగూడెం నుంచి పాలేరు నియోజకవర్గం వరకు 100 రోజులపాటు పాదయాత్ర చేశారు. దాదాపు 2792 కిలోమీటర్ల మేర నడిచారు.

ఆ పాదయాత్ర గురించి ఇప్పటికి ఖమ్మం రాజకీయాలలో చర్చ నడుస్తూనే ఉంటుంది. తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురికావడం.. ఈ వ్యవహారంలో తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు.. ఇంకా కొంతమంది వ్యక్తులు అభియోగాలు ఎదుర్కొంటూ ఉండడం వంటి కారణాలు కేంద్ర కమిటీ దృష్టికి వెళ్లి ఉండవచ్చని.. అందువల్లే ఈ తరహాలో అభిశంషన ఇచ్చి ఉండవచ్చని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఎన్నో రకాల పరిణామాలు ఎదుర్కొని.. రాజకీయ జీవితాన్ని రకరకాలుగా మార్చుకొని.. 72 సంవత్సరాల వయసులో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న తమ్మినేని వీరభద్రం.. ఇప్పుడు కేంద్ర కమిటీ నుంచి అభిశంసన ఎదుర్కోవడం సంచలనం కలిగిస్తోంది. అభిశంసన అనేది కమ్యూనిస్టు పార్టీలో తీవ్రమైన హెచ్చరిక అయినప్పటికీ.. తమ్మినేని వీరభద్రం లేకుండా తెలంగాణలో పార్టీ నడుస్తుందా? పార్టీ ముందుకు వెళ్తుందా? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు లభించాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version