Delhi: పోయిన చేతులు మళ్లీ వచ్చాయి.. ఈ వైద్యులకు చేతులెత్తి మొక్కాల్సిందే..

అతడు ఒక పెయింటర్. ఢిల్లీలో తన కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు. ఒక ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. బతుకు మీద ఆశలు కొట్టేసుకున్నాడు. ఇంట్లో వాళ్లకు భారంగా ఉన్నాననే ఆవేదనలో కూరుకుపోయాడు.

Written By: Suresh, Updated On : March 7, 2024 8:59 am

Delhi

Follow us on

Delhi: అసాధ్యం సుసాధ్యమైతే దానిని అద్భుతం అని అంటాం. అద్భుతానికి మించింది అంటే అత్యద్భుతం అంటాం. ఇది అంతకుమించింది. అలాంటి అత్యద్భుతానికి ఢిల్లీలోని సర్ గంగారం ఆసుపత్రి వేదికయింది. అక్కడి వైద్యులు చూపించిన చొరవకు, చేసిన వైద్యనిరతికి ఓ వ్యక్తి జీవితం బాగుపడింది. ఇక రావు అనుకున్న అతని చేతులు తిరిగి వచ్చాయి. బతుకు మీద సరికొత్త ఆశలు కల్పించాయి.

అతడు ఒక పెయింటర్. ఢిల్లీలో తన కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు. ఒక ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. బతుకు మీద ఆశలు కొట్టేసుకున్నాడు. ఇంట్లో వాళ్లకు భారంగా ఉన్నాననే ఆవేదనలో కూరుకుపోయాడు. అలాంటి వ్యక్తికి ఢిల్లీలోని సర్ గంగారం ఆసుపత్రి వైద్యులు కొత్త జీవితాన్ని, కొత్త చేతులను ప్రసాదించారు.. మీనా మెహతా అనే ఓ మహిళ ఇటీవల బ్రెయిన్ డెడ్ కు గురైంది. అంతకుముందు ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడు అవయవదానానికి ఓకే చెప్పింది. అనుకోకుండా బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ఒప్పుకున్నారు. అయితే ఆ పెయింటర్ కు రెండు చేతులు లేకపోవడంతో మీనా మెహతా రెండు చేతులను అతడికి అతికించారు. కొత్త జీవితాన్ని ప్రసాదించారు. సుమారు 12 గంటల పాటు సర్ గంగారం ఆసుపత్రి వైద్యులు చెమటోడ్చారు. ప్రతి కండరాన్ని, ప్రతి నరాన్ని ఒక్కొక్కటిగా కలిపి చేతులను అమర్చారు.

శస్త్ర చికిత్స పూర్తయిన తర్వాత చేతులు అమర్చిన విధానాన్ని వైద్యులు మీడియా ముందుకు చూపించారు.. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ సర్క్యూలేట్ అవుతున్నాయి. ఆ వైద్యులు పడిన కష్టానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి..” వైద్యులు కనిపించే దేవుళ్ళు. అనే నానుడి మరోసారి నిరూపితమైంది. పెయింటర్ కుటుంబానికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వైద్యుల గురించి ఎంత చెప్పినా తక్కువే.. సర్ గంగారం ఆసుపత్రి వైద్యుల ఘనత చిరస్థాయిలో నిలిచిపోతుందని” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.